కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మార్చిన, ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని ఎంత చెప్తున్నా ముమ్మారు తలాక్ చెప్పే ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు. సరికదా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఒక ప్రబుద్దున్ని ఏమి చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..
వాట్సాప్ లో వాయిస్ మెస్సేజ్ ద్వారా తన భర్త త్రిపుల్ తలాఖ్ చెప్పాడని ఫిర్యాదు చేస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఉదంతం బుధవారం నాడు కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. దుబాయ్‌లో ఉంటున్న తన భర్త ముస్తాఫా బేగ్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తనకు త్రిపుల్ తలాక్ చెప్పాడని పోలీసుల ఎదుట వాపోయిన బాధిత మహిళ.. తాను ఈ విడాకులకు అంగీకరించబోనని స్పష్టంచేశారు. అంతేకాకుండా తనకు న్యాయం జరిగే వరకు తన భర్తపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారామె. పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం బుధవారం రాత్రి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ముస్తఫా బేగ్ దుబాయ్‌లో ఉంటున్నందున ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారని మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు.
శివమొగ్గలో ల్యాప్ టాప్, సీసీ కెమెరాల టెక్నిషియన్‌గా పనిచేసిన ముస్తఫా బేగ్‌తో తనకు 20 ఏళ్ల క్రితమే వివాహమైందని.. కొంతకాలం క్రితమే జీవనోపాధి కోసం తనను, పిల్లలను విడిచి అతను దుబాయ్ వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం వరకు నెలకు రూ.13,000 పంపించిన తన భర్త.. ఇటీవల కాలంలో ఫోన్ చేయడం, డబ్బులు పంపించడం మానేశాడని.. ఇప్పుడు ఏకంగా త్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.