tdp mla rama naidu pc: దేశ చరిత్రలోఎప్పుడు జరగని విధంగా రైతులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు టీడీపీ అసెంబ్లీ డిప్యూటీ ప్లోర్ లీడర్ నిమ్మల రామానాయడు. 2019-2020 ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మేము ఆధారాలతో బయటపెడుతున్నామని, అందుకే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు చంద్రబాబుకి ఎందుకు మైక్ ఇవ్వడంలేదని రామానాయుడు ప్రశ్నించారు. స్పీకర్, ముఖ్యమంత్రి జగన్ సభను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ప్రతిరైతుకు ఇన్సూరెన్స్ అందిందని గుర్తు చేసిన ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా 2019-2020 ఇన్సూరెన్స్ చెల్లించారన్నారు. కానీ మన రాష్ట్రంలో రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించలేదని విమర్శించారు. నిన్న అసెంబ్లీలో టీడీపీ ఆందోళన చేయడంతో హడావిడిగా అర్ధరాత్రి ఇన్సూరెన్స్ పై జోవో ఇచ్చారన్నారు. ఇప్పుడు ప్రీమియం కడితే గత సంవత్సరం ఇన్సూరెన్స్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.
సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులపై టీడీపీ తరుపున ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకువస్తామని రామానాయుడు తెలిపారు. రైతుల కోసం ఎందాకైనా పోరాటం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్ని సస్పెన్షన్ లు రైతుల కోసం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.