రివ్యూకు ‘నో’.. అయోధ్యపై సున్నీ బోర్డు సెన్సేషనల్ నిర్ణయం

| Edited By: Srinu

Nov 26, 2019 | 3:37 PM

అయోధ్య తీర్పు వెలువడినప్పట్నించి రివ్యూ పిటిషన్‌పై జరుగుతున్న చర్చకు సున్నీ వక్ఫ్ బోర్డు తెరదించింది. రివ్యూ పిటిషన్ వేసేది లేదని మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు మంగళవారం జరిగిన సమావేశానికి హాజరు కాగా.. రివ్యూ పిటిషన్ ఫైల్ చేయరాదన్న నిర్ణయాన్ని 6:1 మెజారిటీతో తీసుకున్నారు. దాంతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారా? చేయరా? అన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. నవంబర్ 9న సుప్రీంకోర్టు అయోధ్య స్థల వివాదంపై చారిత్రాత్మక తీర్పు […]

రివ్యూకు ‘నో’.. అయోధ్యపై సున్నీ బోర్డు సెన్సేషనల్ నిర్ణయం
Follow us on

అయోధ్య తీర్పు వెలువడినప్పట్నించి రివ్యూ పిటిషన్‌పై జరుగుతున్న చర్చకు సున్నీ వక్ఫ్ బోర్డు తెరదించింది. రివ్యూ పిటిషన్ వేసేది లేదని మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు మంగళవారం జరిగిన సమావేశానికి హాజరు కాగా.. రివ్యూ పిటిషన్ ఫైల్ చేయరాదన్న నిర్ణయాన్ని 6:1 మెజారిటీతో తీసుకున్నారు. దాంతో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారా? చేయరా? అన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.

నవంబర్ 9న సుప్రీంకోర్టు అయోధ్య స్థల వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, తీర్పు ఏకపక్షంగా వుందని పలువురు ముస్లిం వర్గాలు అభిప్రాయపడిన నేపథ్యంలో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనమిచ్చిన తీర్పుపై సమీక్షకు వెళ్ళాలా వద్దా అన్న విషయంలో రకరకాల కథనాలు వినిపించాయి. నవంబర్ పదో తేదీన రివ్యూ పిటిషన్‌కు వెళ్ళబోమని తొలుత సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై బోర్డులోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దాంతో నవంబర్ 16వ తేదీన సున్నీ వక్ఫ్ బోర్డు సమావేశమైంది. దీనికి తమ తరపున వాదించిన అడ్వకేట్లను కూడా ఆహ్వానించారు వక్ఫ్ బోర్డు సభ్యులు. సుదీర్ఘంగా జరిగిన ఆనాటి సమావేశంలో రివ్యూ పిటిషన్‌కు వెళ్ళే అవకాశాలను పరిశీలించాలని సీనియర్ అడ్వకేట్లను కోరింది బోర్డు. దాంతో దాదాపు వారం రోజుల పాటు రివ్యూ అవకాశాలను పరిశీలించిన న్యాయవాదులు సాధ్యాసాధ్యాలను బోర్డుకు నివేదించారు.

న్యాయవాదుల సలహాలతోపాటు.. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల నుంచి, ముస్లిం ప్రముఖుల నుంచి సున్నీ వక్ఫ్ బోర్డుకు పెద్ద ఎత్తున సలహాలు వచ్చిపడ్డాయి. బాలీవుడ్ ముస్లిం ప్రముఖులు చాలా మంది ఈ వివాదానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ముగింపును గౌరవించాలని, వివాదాన్ని కొనసాగించేలా రివ్యూ పిటిషన్‌కు వెళ్ళ వద్దని సున్నీ వక్ఫ్ బోర్డుకు సూచించారు. ఈ మేరకు సూచించిన వారిలో జావెద్ అక్తర్, షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా తదితరులున్నారు.

తాజాగా మంగళవారం లక్నోలో సమావేశమైన సున్నీ వక్ఫ్ బోర్డు సమావేశంలో సాధ్యాసాద్యాలను కూలంకషంగా చర్చించిన తర్వాత రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. హాజరైన ఏడుగురు సభ్యుల్లో ఒకరు మాత్రమే రివ్యూకు వెళ్ళాలని పట్టుబట్టగా.. మిగిలిన ఆరుగురు వద్దని వారించినట్లు సమాచారం. దాంతో 6:1 మెజారిటీతో వక్ఫ్ బోర్డు రివ్యూకు వెళ్ళరాదన్న నిర్ణయానికి బోర్డు వచ్చిందని తెలుస్తోంది. తాజా నిర్ణయంతో ఓ ఉత్కంఠకు తెరపడినట్లయింది.