Sensex lost 4 lac crores in 5 minutes: జస్ట్ అయిదే అయిదు నిమిషాలు… నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపద మట్టిగొట్టుకుపోయింది. అందుకు కారణం కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కమ్ముకుంటుదేమోనన్న భయం దేశీయ స్టాక్ మార్కెట్లను గడగడలాడించింది. దాంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీస్థాయిలో పతనమయ్యాయి.
పవిత్ర మక్కాకు రాకపోకలను సౌదీ అరేబియా నిలిపివేయడంతో పాటు యూరప్ దేశాలు మితిమీరి జాగ్రత్తలు పాటిస్తుండటంతో ఎక్కడో ఏ మూలో ఉన్న అనుమానం స్థానంలో భయం మొదలైంది. అది కాస్తా పెరిగి పెద్దదై స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. గత అయిదు సెషన్లలో నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఆరో సెషన్‌లో ఒక్కసారిగా కుదేలయ్యాయి. 2008 తర్వాత మార్కెట్లు ఇంతగా పడిపోయిన సందర్భం లేదు.
వరల్డ్ సప్లై చెయిన్‌పై కరోనా వైరస్ ప్రభావం పడింది…చైనా ఎగుమతులు తగ్గిన ఫలితం ఇప్పుడు మార్కెట్లపై కనిపిస్తోంది. 1100 పాయింట్ల దిగువన సెన్సెక్స్ కొనసాగుతోంది. 280 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. కరోనా భయాలతో అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు మదుపరులు. దీంతో అయిదు కోట్ల రూపాయల మదుపరుల సంపద కరోనా దాటికి బలయ్యింది. కోవిడ్ భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే మరణాల సంఖ్య 3 వేలు దాటింది. 80 వేల మందికి పైగా కరోనా సోకినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా ఎఫెక్ట్ ప్రపంచ ఆర్ధిక స్థిరత్వంపై పలు అనుమానాలు కలిగిస్తోంది. తాజాగా ఇటలీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్లోబల్ జీడీపీపై దీని ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.