Hyderabad police shocks home quarantine person: హైదరాబాద్ పోలీసులు హోమ్ క్వారెంటైన్ అయిన వ్యక్తికి గట్టి షాక్ ఇచ్చారు. కేసు నమోదు చేసి… గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హోమ్ క్వారెంటైన్ వ్యక్తిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు.
మార్చ్ 19న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చిన పెళ్లిపాగా రోహన్ అనే వ్యక్తిని పరిశీలించిన వైద్యులు హోమ్ క్వారెంటైన్ అడ్వైజ్ చేస్తూ చేతి మీద ముద్ర కూడా వేశారు. అయితే రోహన్ వైద్యుల సూచనను బేఖాతరు చేశాడు. లాక్ డౌన్ లో భాగంగా సైబర్ టవర్ వద్ద తనిఖీలు చేపట్టిన మాదాపూర్ పోలీసులకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తూ కనిపించాడు రోహన్.
చేతి మీద ముద్రతో కనిపించిన రోహన్.. తన ప్రాణాలతోపాటు కుటుంబ సభ్యులు, ఇతర ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టినట్టు గుర్తించిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం విధించిన రూల్స్ పాటించకుండా, హోమ్ క్వారంటైన్ తీసుకోకుండా బయట తిరుగుతున్న రోహన్ మీద కేసు నమోదు చేసి… ఐసోలేషన్ కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రోహన్ మీద 1897యాక్ట్ సెక్షన్ 188, 269 ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇలాంటి పిచ్చి పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని పోలీస్ సూచిస్తున్నారు.