
భారతీయ జనతా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డీకే అరుణ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. పార్టీ అధిష్టానం తనకు తగిన గుర్తింపు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నియామకం తర్వాత ఆమె ఇవాళ (ఆదివారం) చిలుకూరు బాలాజీ స్వామివారి ప్రధానార్చకులు డాక్టర్ ఎం వి సౌందరరాజన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఉదయం చిలుకూరు వచ్చిన ఆమె 2007లో దేవాదాయ చట్ట సవరణలో ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని సమర్పించినట్లు గానే కేంద్రంలో ధార్మిక పరిషత్ ద్వారా దేవాలయాల నిర్వహణ జరిగే అంశాన్ని గట్టిగా సమర్పిస్తానని ఈ సందర్భంగా చెప్పారు.
తమ కుటుంబానికి చిలుకూరు బాలాజీ అర్చక పరంపరకి దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా అరుణ గుర్తుచేసుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆధ్వర్యంలో దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాల కొరకు జరుగుతున్న ఉద్యమంలో తన వంతు సహకారం కేంద్రంలో అందించవలసిందిగా సౌందరరాజన్ ఈ సందర్భంలో డీకే అరుణను అభ్యర్థించారు.