ఇన్నాళ్లు పాతబస్తీకే పతంగి పరిమితమైంది. ఇప్పుడు మరో ప్రాంతానికి ఎగరాలని ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడుప్పుడు నిజామాబాద్‌లో హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ పూర్తిస్తాయిలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ మేయర్ పదవి లక్ష్యంగా పావులు కదుపుతోంది. పతంగి ప్లాన్‌లతో గులాబీ సేనకు దడ పట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది.
మునిసిపల్ ఎన్నికల వేళ…నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన సభ పొలిటికల్ హీట్‌ను పెంచింది. కేసీఆర్‌తో తాము నడుస్తామని అసద్ చేసిన ప్రకటనతో నిజామాబాద్‌లో ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో పది సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ నిజామాబాద్ నగర మేయర్ పీఠం దక్కించుకుంది. 16 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకుంది. ఈ సారి కూడా ఇదే వ్యూహాంతో ముందుకు వెళ్తాయని అంతా అనుకున్నారు. అయితే ఎంఐఎం మాత్రం ఈ సారి మేయర్ సీటు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఎంఐఎంకు మేయర్ సీటు ఇచ్చేందుకు రెడీగా లేరని సమాచారం.
నిజామాబాద్ నగర పాలక సంస్థలో తొమ్మిది గ్రామాల విలీనంతో డివిజన్లు 60కి పెరిగాయి. వీటిలో 20 సీట్లలో మైనార్టీల ప్రభావం ఎక్కువ. ఈ డివిజన్లపై ఎంఐఎంతో పాటు టీఆర్‌ఎస్ కూడా ఫోకస్ పెట్టింది. అయితే నిజామాబాద్‌తో పాటు బోధన్‌లో కూడా ఎంఐఎంతో పొత్తు కీలకం. దీంతో తమకు ఈ సారి మేయర్ సీటు వస్తుందనే ఆశలో ఎంఐఎం నేతలు ఉన్నారు. మరోవైపు మేయర్ రిజర్వేషన్ జనరల్ లేదా జనరల్ మహిళకు వస్తుందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా తమ పార్టీ నేత మేయర్ అవుతారని టీఆర్‌ఎస్ అంటోంది. మొత్తానికి మేయర్ సీటు కోసం ఎంఐంఎం టార్గెట్ పెట్టుకోవడం ఇందూరులో చర్చ జరుగుతోంది.