సమాజంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ఆడవాళ్లు రోడ్డు మీదకు ఒంటరిగా రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు అమలులోకి తీసుకొచ్చినా నేరాలు మాత్రం తగ్గట్లేదు. ఏదొక చోట చిన్నారులు, యువతులు కామాంధుల బారిన పడుతూనే ఉన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు జీవచ్ఛవాలుగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కాగా, ఒంగోలులో ఒక దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే ఒంగోలులోని కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో వివస్త్రగా పడి ఉంది. పనులకు వెళ్తున్న స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇక సంఘటనాస్థలంలో ఆమె పక్కనే లో దుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడి ఉన్నాయి. దీనితో పోలీసులు మహిళపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా, సదరు మహిళ కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్ వైద్యశాలకు తరలించారు.
ఇక ఆ మహిళ ఎవరు.? బాధితురాలికి తెలిసిన వారే శివారు ప్రాంతానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డారా.? లేక మహిళను కిడ్నాప్ చేసి అనంతరం దారుణానికి ఒడిగట్టారా.? అన్నది తేలాల్సి ఉండగా సదరు మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మిస్టరీని సాల్వ్ చేసేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.
అటు మహిళ గొంతులో దుండగులు బియ్యం గింజలు పోసినట్టు డాక్టర్లు గుర్తించారు… కడుపులో, ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు లభ్యమైనట్లు సమాచారం. కాగా, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.