Sad News కరోనాతో 4 నెలల పసిపాప మృతి

కరోనా వైరస్ దేశంలో మృత్యు ఘోష వినిపిస్తోంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కంటైన్మెంట్ జోన్ల పేరిట పక్కా చర్యలు తీసుకుంటున్నా మరణాల సంఖ్యను నిలువరించలేకపోతున్నారు.

Sad News కరోనాతో 4 నెలల పసిపాప మృతి

Updated on: Apr 24, 2020 | 4:31 PM

కరోనా వైరస్ దేశంలో మృత్యు ఘోష వినిపిస్తోంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కంటైన్మెంట్ జోన్ల పేరిట పక్కా చర్యలు తీసుకుంటున్నా మరణాల సంఖ్యను నిలువరించలేకపోతున్నారు. మరోవైపు కరోనాను సమర్థవంతంగా నియంత్రించ గలిగారంటూ ఓ వర్గం మీడియా కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే ఆ రాష్ట్రంలో హృదయ విదారకమైన మరణాలు చోటుచేసుకుంటూనే వున్నాయి.

తాజాగా కేరళలో నాలుగు నెలల పసిపాప కరోనా సోకి మరణించింది. 4 నెలల పసిపాపకు కరోనా పాజిటివ్ రాగా ఆసుపత్రికి తరలించారు. కేరళలోని మలప్పురానికి చెందిన ఈ 4 నెలల పసిపాప శుక్రవారం ఉదయం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితికి మీడియాలోని ఓ వర్గం చేస్తున్న ప్రచారానికి పొంతన లేదనేది తాజాగా పసిపాప మరణంతో తేలిపోయింది.

కరోనాతో మృతి చెందిన పాప గత 3 నెలలుగా గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమెకు కరోనా సోకడంతో ప్రాణాలను కాపాడలేకపోయామని వారు చెబుతున్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్నా మీడియాలోని ఓ వర్గం ప్రభుత్వానికి అనుగుణంగా పాజిటివ్ కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందని, ఆ నిర్లక్ష్యంలో భాగమే తాజాగా పసిపాప మరణమని కొందరు ఆరోపిస్తున్నారు. కరోనాను సక్సెస్ ఫుల్‌గా కేరళ ప్రభుత్వం నియంత్రించగలిగిందని, కేరళ ముఖ్యమంత్రి బాటలో ప్రధాని నడవాలని ఈ మధ్య సీపీఎం సీనియర్ నేతలు సూచించడం ఈ సందర్భంగా గమనార్హం.