గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) బాగా పడిపోయిన పరిస్థితిలో దేశంలోని ఆర్థిక వేత్తలు తలోరకంగా స్పందిస్తున్నారు. బిజెపి పాలనలో జిడిపి గణనీయంగా పడిపోతోందని, దానికి కారణం నరేంద్ర మోదీ, తదితర బిజెపి నేతల అనుభవరాహిత్యమైన పరిపాలనే అని వారంటున్నారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా వున్న కేంద్ర ఆర్థిక శాఖా మాజీ మంత్రి పి. చిదంబరం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
గడచిన మూడో త్రైమాసికానికి దేశ జిడిపి కేవలం 4.5 గా నమోదైన నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు, ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012-13 తర్వాత ఇంత తక్కువగా జిడిపి నమోదవడం ఇదే ప్రథమం. సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లోను ఈ అంశాన్ని పలువురు ప్రస్తావించారు. వీరిలో అధికార పార్టీ ఎంపీలు కూడా వున్నారు. ఓ బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంలో బిజెపి ఎంపి నిశికాంత్ దూబే.. జిడిపిని ఓ బైబిల్‌గానో, మహాభారతంగానో చూడొద్దని, 1934 కంటే ముందు అసలు జిడిపి అనేదే లేకుండా దేశం ముందుకెళ్ళిందని తనకున్న మిడిమిడి పరిఙ్ఞానంతో వ్యాఖ్యానించారు.
నిశికాంత్ దూబే లోక్‌సభ వేదికగా కామెంట్లను ఉటంకించిన చిదంబరం ఆర్థిక వ్యవస్థపై బిజెపి నేతలకున్న అవగాహన ఈ కామెంట్లతో తేలిపోయిందని, ఇక దేశ ఆర్థిక వ్యవస్థను ఆ దేవుడే కాపాడాలని అన్నారు. దేశంలో ప్రస్తుతం ఆటోమోబైల్, ఎఫ్ఎంసీజి, రియల్ ఎస్టేట్ రంగాలు కుదేలైపోయాయని చిదంబరం అన్నారు. ఒక పక్క దేశం అన్ని రంగాల్లో కునారిల్లిపోతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా… మాటలతో కాలక్షేపం చేస్తున్నారని చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేవుడే దిగి వచ్చినా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్న నమ్మకం పోతోందని చెప్పుకొచ్చారు చిదంబరం.