ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులపై రంగంలోకి ఈడీ.. తెరచాటు చైనా హస్తంపై నజర్.. టీఎస్ పోలీసుల నుంచి సమాచార సేకరణ

|

Dec 27, 2020 | 12:07 PM

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఆన్‌లైన్ లోన్ యాప్స్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. తెలంగాణ పోలీసుల నుంచి...

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులపై రంగంలోకి ఈడీ.. తెరచాటు చైనా హస్తంపై నజర్.. టీఎస్ పోలీసుల నుంచి సమాచార సేకరణ
Follow us on

ED entered in Online loan apps case: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఆన్‌లైన్ లోన్ యాప్స్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం సేకరించేందుకు రెడీ అవుతోంది. ఆ మొబైల్ అప్లికేషన్ల వెనుక చైనీయుల హస్తం వుందన్న కథనాల మేరకు ఆ దిశగా దర్యాప్తు చేసేందుకు ఈడీ సమాయత్తమవుతోంది. కాగా చైనీస్ లింకులపై ఈ పాటికే ఈడీకి కావాల్సిన ఇన్‌పుట్స్ అందినట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ లోన్ యాప్స్‌లో చైనీస్ హస్తంపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చైనీస్ లింకులకు సంబంధించి ఆధారాలు బయట పడుతున్నాయి. ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై తెలంగాణ పోలీసులను ఈడీ సమాచారం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చైనీయుల లింకులపై కూపీ లాగుతున్న తెలంగాణ పోలీసులు.. కావాల్సిన సమాచారాన్ని సేకరించేందుకు గూగుల్ సంస్థకు లేఖ రాశారు. గూగుల్ ప్లే స్టోర్స్‌లో వున్న 158 ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని తొలగించాలని తెలంగాణ పోలీసులు గూగుల్‌ను తమ లేఖ ద్వారా కోరారు. హైదరాబాద్ పోలీసులు 42 యాప్‌లను, సైబరాబాద్ పోలీసులు 116 మొబైల్ యాప్‌లను తొలగించాలని లేఖ రాశారు.

వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాధితులను టెలికాలర్లు వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు. బాధితులకు లోన్ రూపంలో ఇస్తున్న 350 బ్యాంకు అకౌంట్‌లలో ఉన్న 87 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ మొబైల్ యాప్‌ల వెనుక చైనా హస్తముందన్న కథనాల నిగ్గు తేలనున్నది.