తెగని తగవు: నా వంతు అంటూ అమర్ నాథ్ ఎంట్రీ, సాయినాథుని సాక్షిగా సాగరనగరంలో కొనసాగుతోన్న వెలగపూడి వర్సెస్ వైసీపీ
సవాళ్లు కొనసాగుతున్నాయి.. ప్రతి సవాళ్లు మీసం మేలేస్తున్నాయి. ప్రమాణం నీదా.. నాదా? అంటూ సాగర తీరంలో పొలిటికల్ సునామీ ఆదివారం కూడా కొనసాగుతోంది...
సవాళ్లు కొనసాగుతున్నాయి.. ప్రతి సవాళ్లు మీసం మేలేస్తున్నాయి. ప్రమాణం నీదా.. నాదా? అంటూ సాగర తీరంలో పొలిటికల్ సునామీ ఆదివారం కూడా కొనసాగుతోంది. ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి వస్తా.. ప్రమాణం చేసి తన నిజాయితీ నిరూపించుకుంటానంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ.. బంతిని వైసీపీ కోర్టుకు విసిరారు. మధ్యలో ఎంట్రీ ఇచ్చి, నేను వచ్చా.. రా.. అంటూ నిన్న ఉదయం ఆయన ప్రత్యర్థి విజయనిర్మల హల్‌చల్ చేశారు. మధ్యాహ్ననానికి సీన్‌లోకి ఎమ్మెల్యే అమర్‌నాథ్ ఎంటర్ అయ్యారు. విజయసాయిరెడ్డికి సవాల్ విసిరే స్థాయి వెలగపూడికి లేదని..తనతో సవాల్‌కి రావాలంటూ నిర్మలను పక్కకు నెట్టి అమర్‌నాథ్ రంగంలోకి దిగారు. విజయసాయికి వెలగపూడి విసిరిన సవాల్‌ను తాను స్వీకరించిన అమర్‌నాథ్.. సాయిబాబా గుడిలో సత్య ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం 11 గంటలకు సాయిబాబా గుడికి వెళ్లేందుకు సిద్ధమన్నారు. అంతేకాదు వెలకగపూడి భూ ఆక్రమణాలపై తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. అమర్‌నాథ్‌తోపాటు పెద్దయెత్తున పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈస్ట్‌పాయింట్ కాలనీలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే, తాను సవాల్ విసిరింది విజయసాయిరెడ్డికి మాత్రమేనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అంటున్నారు. విజయసాయిరెడ్డి వస్తారంటే..తానూ ప్రమాణం చేయడానికి వస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాతే మిగిలిన వైసీసీ నేతల సవాల్‌ను స్వీకరిస్తానని వెలగపూడి తెలిపారు. నిర్మల వర్సెస్ వెలగపూడి: అసలేం జరిగింది?.. ఏం జరుగబోతోంది? సాగరనగరంలో ఎందుకీ పొలిటికల్ సునామీ?