కరోనా వ్యాప్తిలో ఆది నుంచి ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో అమెరికా నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, పెరు దేశాలు ఉన్నాయి.
బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 20,229 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, అంతకుముందు రోజు 26 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 620 మంది కరోనా కాటుకు బలయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 16,23,284కు చేరుకోగా.. మరణాల సంఖ్య 65,487కు దగ్గరైంది. ఇక, కరోనాను జయించి ఇప్పటివరకు మొత్తంగా 9,27,292 మంది పూర్తిగా కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 17 లక్షల 69 వేల 250 గా నమోదుకాగా.. 5,41,487 మంది కరోనా బారిపడి ప్రాణాలు కోల్పోయారు.