దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా.. గడచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు మరో మైలురాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 1,715 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26వేలు దాటింది. ఇక మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతంగా ఉంది. శనివారం నమోదయిన మొత్తం కేసుల్లో సగం అక్కడే బయటపడ్డాయి. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కరోనా బారిన పడ్డ ఇద్దరు పోలీసులు మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సామాన్యులతో పాటు కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. ఇద్దరు పోలీసుల మృతిపై సీఎం ఉద్థావ్ థాక్రే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతుండగా, ఇప్పటివరకు దాదాపు 100మంది పోలీసులకు కరోనా సోకినట్లు సమాచారం.
కరోనాతో మృతిచెందిన పోలీసు ఉద్యోగులు ఇద్దరు ముంబయి లోని వాహోలా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వరిస్తున్నారు. మృతులు హెడ్‌కానిస్టేబుల్ సందీప్ ఎమ్‌సర్వీ, హెచ్‌సీ చంద్రకాంత్ జీ పెండూల్కర్ గా అధికారులు తెలిపారు. వీరి మృతిపై ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌బిర్ సింగ్ ట్విట్టర్ వేదికగా పరామర్శించారు. ముంబయ్ వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. కేవలం ఒక్క పోలీస్ శాఖలోనే సుమారుగా 40 మందికి పైగా పోలీసులే కోవిడ్ బారినపడినట్లుగా ఆయన తెలిపారు. వారందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు.