ముంబైలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మరి.. అప్రమత్తమైన బీఎంసీ అధికారులు.. కంటెన్మెంట్ జోన్లుగా పలు భవనాలు

దేశంలో కరోనా మరోసారి దడ పుట్టింది. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త కేసులు వెలుగు చేస్తున్నాయి. ఇక, మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది.

ముంబైలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మరి.. అప్రమత్తమైన బీఎంసీ అధికారులు.. కంటెన్మెంట్ జోన్లుగా పలు భవనాలు
Follow us

|

Updated on: Feb 20, 2021 | 9:29 PM

Corona cases in India : దేశంలో కరోనా మరోసారి దడ పుట్టింది. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుండగానే, మరోవైపు కొత్త కేసులు వెలుగు చేస్తున్నాయి. ఇక, మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు మెల్ల మెల్లగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారుతుంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో కొత్తగా 2,749 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మరోసారి కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. నగరంలో 1,305 భవనాలను మూసివేసినట్లు తెలిపింది.

అయితే, కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో తిరిగి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఇక, ఇప్పటివరకు 1,305 భవనాలను కంటెన్మెంట్ జోన్లుగా మార్చామన్నారు. మూసివేసిన భవనాల్లోని ఫ్లాట్లు, ఇళ్లలో మొత్తం 71,838 మంది ప్రజలు నివాసం ఉంటున్నట్లు బీఎంసీ వెల్లడించింది. ఆయా భవనాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మూసివేసినట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు ముంబై వ్యాప్తంగా కొవిడ్ పరీక్షల సంఖ్యను కూడా భారీగా పెంచినట్లు తెలిపింది.

ఇక, ముంబై మహానగరంలో శుక్రవారం 823 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గత మూడు నెలల్లో ఒకే రోజు అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని బీఎంసీ అధికారులు తెలిపారు. శనివారానికి ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒకే రోజు 2,749 కేసులు నమోదయ్యాయి. ఇది ముంబైవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబైలో కొవిడ్ కారణంగా ఇప్పటికే 11,435 మంది మృత్యువాతపడ్డారు.

అయితే, ఇక్కడ ఆందోళన కలిగించే మరో విషయం ఏమంటే, మ‌హారాష్ట్రలో పలువురికి రెండోసారి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని బీఎంసీ అధికారులు తెలిపారు. ఎన్‌సీపీ సీనియ‌ర్‌ నాయ‌కుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖ‌డ్సేకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది, ఆయనకు క‌రోనా వైర‌స్ సోక‌డం ఇది రెండోసారి. ఖడ్సేతో పాటు ప్రస్తుతం మ‌హాకూట‌మిలో మంత్రిగా ఉన్న బ‌చ్చూ క‌దూకి కూడా రెండోసారి కరోనా సోకింది. ప్రస్తుతం వారిద్దరూ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ విడివిడిగా చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు.

మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆ రాష్ట్రం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగటివ్ రిపోర్టు సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు.

Read Also… ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. ఇప్పటి వరకు 20కోట్ల మందికి టీకాలు