గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహ్మారావు. ఐదేళ్లలో అమరావతిని రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. వందల కోట్ల సొమ్ము కొట్టేసి.. అదే అవినీతి డబ్బుతో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. టీడీపీ పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలన్నీ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలేనన్నారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటున్నారు కాబట్టే.. చంద్రబాబుపై స్టిక్కర్ బాబు అని ముద్రపడిందన్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 1న మోదీ రాజమండ్రి వస్తున్నారని తెలిపారు. అలాగే అమిత్ షా 4న నరసరావుపేట, విశాఖపట్నం సభల్లో పాల్గొంటారన్నారు. ఏప్రిల్ 4, 5 తేదీల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నర్సాపురం, విజయనగరం సభలకు హాజరవుతారన్నారు. ఏప్రిల్ 5, 6 తేదీల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో పాల్గొంటారన్నారు. వచ్చే 10 రోజుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కూడా ప్రచారంలో పాల్గొంటారని జీవీఎల్ వెల్లడించారు.