బుల్లితెర సంచలనం ‘బిగ్‌బాస్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భాష ఏదైనా ఇప్పుడు ‘బిగ్‌బాస్’ అంటే వివాద ‘షో’ అన్నంతగా మారింది. ఇక తెలుగులో రేపు(ఆదివారం) ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ మూడో సీజన్ కూడా ఇప్పటికీ పలు వివాదాల్లో చిక్కుకుంది. అయినా బిగ్‌బాస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైపోయారు నిర్వాహకులు. కాగా తమిళ్‌లో కమల్ హాసన్ వ్యాఖ్యతగా ఇప్పటికే ‘బిగ్ బాస్ 3’ ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే అక్కడ కూడా అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈసారి అక్కడ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న పలువురిపై కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మధ్యన నటి వనితా విజయ్‌కుమార్‌ను ఆమె కుమార్తె కేసు విషయంలో కలిసేందుకు తెలంగాణ పోలీసులు, చెన్నై పోలీసులు హౌస్‌లోకి విచారణకు వెళ్లారు. కానీ తాను తల్లి వద్దే ఉంటానని ఆమె కుమార్తె స్పష్టం చేయడంతో.. ఆ వివాదం కాస్త ముగిసింది. లేకపోతే ఈ కేసులో పోలీసులు వనితాను అరెస్ట్ చేసే అవకాశం ఉండేది.
ఇదిలా ఉంటే అక్కడ తాజాగా మరో కంటెస్టెంట్ విషయంలోనూ అలానే జరిగింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న నటి మీరామిథున్‌పై కొన్ని కేసులు ఉన్నాయి. తాను అందాల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పి తన వద్ద రూ.50వేలను తీసుకుందంటూ ఓ వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మీరా మిథున్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ లోపు ఆమె చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. తనపై తప్పుడు కేసు పెట్టారని.. ప్రస్తుతం తాను షోలో ఉన్నానని.. బయటకు రాగానే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. ఆమె కోరికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొన్ని నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులు మరోసారి ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: జబర్డస్త్ వినోద్ మీద హత్యా యత్నం..