Big News Big Debate: భువనేశ్వరికి వంశీ ఎందుకు క్షమాపణ చెప్పారు.. అసలు ఆ రోజు బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో ఏం జరిగింది..

|

Dec 07, 2021 | 4:06 PM

Hyderabad: చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో కంటతడి పెట్టడం, ఆ తర్వాత అసెంబ్లీ మీటింగ్‌ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుక్కపెట్టి ఏడవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే...

Big News Big Debate: భువనేశ్వరికి వంశీ ఎందుకు క్షమాపణ చెప్పారు.. అసలు ఆ రోజు బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో ఏం జరిగింది..
Big News Big Debate Tv9 Tel
Follow us on

Big News Big Debate: చంద్రబాబు అసెంబ్లీ సమావేశంలో కంటతడి పెట్టడం, ఆ తర్వాత అసెంబ్లీ మీటింగ్‌ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుక్కపెట్టి ఏడవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన భార్యను వైసీపీ నాయకులు అవమాన పరిచారంటూ చంద్రబాబు కంటతడి పెట్టడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు దీనిని పెద్ద ఎత్తున ఖండించారు. అయితే పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో టీవీ9లో జరిగిన బిగ్‌న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ఈ సమస్యకు ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఈ కార్యక్రమం వేదికగానే వల్లభనేని వంశీ, భువనేశ్వరికి తన క్షమమాణలు చెబుతూ.. ఆవేశంలో ఏదో నోరు జారానని, ఒక మాట చెప్పబోయి మరో మాట అనేశానని. తాను తప్పుగా మాట్లాడానని చెప్పేశాడు. దీంతో ఈ అంశానికి అక్కడితో ఫుల్‌ స్టాప్‌ పడింది. అయితే ఇంతకీ వంశీ ఎందుకు క్షమాపణాలు చెప్పారు.? అసలు ఆ పరిస్థితికి దారి తీసిన అంశాలు ఏంటి.? అన్నది చాలా మందికి తెలియదు. కానీ బిగ్‌న్యూస్‌ బిగ్ డిబేట్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించే రమేష్‌. యల్లంకి తొలి సారి తన స్వీయ అనుభవాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..

‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని కవి ఎప్పుడో చెప్పారు. అవును అన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరిగితే అది హెడ్ లైన్ ఎందుకు అవుతుంది. బ్రేకింగ్ న్యూస్‌గా ఎలా మారుతుంది. సహచర జర్నలిస్టులు ఏదో వార్త సేకరించడానికి పోతే.. మరేదో బ్రేకింగ్ దొరికినట్టుగా Tv9 ప్రైమ్ టైమ్ ప్రొగ్రామ్ ప్రొడ్యూసర్ గా నాకు కూడా ఇటీవల ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది. అదే నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ ఎపిసొడ్. అసలు ఈ సీను మొత్తం కూడా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుంది. క్షణాల్లో మీడియా మొత్తానికి బ్రేకింగ్ న్యూస్ గా మారి పార్టీల్లో చర్చోపచర్చలకు కారణమైన ఈ ఎపిసోడ్ పై నాకు ఎదురైన చిత్ర విచిత్ర అనుభవాలు మీతో పంచుకునే ప్రయత్నమే ఇది.

అసలేం జరిగిందంటే..

ప్రైమ్ టైమ్ షో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ప్రొడ్యూసర్‌గా రోజులాగే మధ్యాహ్నమే సబ్జెక్టు డిసైడ్ చేసి ప్రొమో కూడా వేశాం. డిసెంబరు1న ముందుగా అనుకున్న సబ్జెక్టు ఢిల్లీలో TRS ఎంపీల ఆందోళనలు, వరి సేకరణ విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయం. పార్టీల మధ్య పరస్పర నిందారోపణలు. దీనిపైనే రోజంతా ప్రోమో రన్‌ అయింది. మధ్యాహ్నం ఖమ్మం జిల్లా మధిర కౌన్సిలర్‌ మల్లాది వాసు కమ్మ సంఘం కార్తీక మాసం సమారాధన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు టీవీ9 దృష్టికి వచ్చాయి. దీనిపై ఇన్‌పుట్‌ టీమ్‌ పూర్తి సమాచారం సేకరించి కథనాలు ప్రసారం చేసింది. వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులపై సాధారణ విమర్శలు చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.

కానీ ఆయన చేసింది హింసను ప్రేరేపించేదిగా ఉండటంతోనే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై వల్లభనేని వంశీ స్పందించి.. సీనులోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీని, చంద్రబాబును కూడా లాగారు. చూస్తుండగానే ఇది ఓ కులంతో పాటు రెండు రాష్ట్రాల సమస్యగా మారుతుందని గ్రహించాను. 6గంటలకు డ్రైవ్ నడిపించాలని నిర్ణయించారు. దీనిపైనే రజనీకాంత్ బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన తట్టింది. సాయంత్రం 5గంటల 40 నిమిషాల సమయంలో రజనీకాంత్‌ దృష్టికి తీసుకెళ్లి డెవలప్‌మెంట్ పై చర్చించా.

రజనీకాంత్ వద్దని వారించలేదు. అలాగని పూర్తిగా అంగీకరించలేదు. మల్లాది వాసు, ఆరికెపూడి గాంధీ, వల్లభనేని వంశీ చర్చకు వస్తే ఆలోచిద్దామన్నారు. అప్పుడు మొదలైంది అసలు కథ. మా ఇన్‌పుట్‌ టీమ్‌ దొంతు రమేష్‌, అశోక్‌ వేములపల్లికి గెస్టుల బాధ్యత తీసుకోమని కోరాను. మధిర కౌన్సిలర్‌ వాసు ఓకే అన్నారు. అరికెపూడి గాంధీ చర్చకు సిద్దమేనన్నారు. వల్లభనేని వంశీ కోసం అశోక్‌ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వంశీ లేకుండా సింగిల్‌ వెర్షన్‌ వద్దు అనుకున్నాం. 6గంటల తర్వాత కూడా మరోసారి ప్రయత్నించాం. కానీ వల్లభనేని వంశీ అందుబాటులోకి రాలేదు. ఇక దీనిపై చర్చే వద్దనుకున్నాం. అప్పటికీ మధ్యాహ్నం అనుకున్న పాత ప్రోమోనే ప్లే అవుతూ వచ్చింది. వాసుకు, గాంధీకి కూడా 7గంటలకు చర్చ లేదని చెప్పేశాం. ఇదంతా 6.30 గంటలకు జరిగింది.

పది నిమిషాల ముందు హైడ్రామా..

మేకప్ అయి.. స్డూడియోకు వచ్చిన తర్వాత రజనీకాంత్ 6.50కి అంటే సరిగ్గా హెడ్ లైన్స్ పడటానికి ఐదారు నిమిషాల ముందు మధిర వాసుతో పాటు ఆరికేపూడి గాంధీని 5నిమిషాలు లైన్ లో తీసుకుందామన్నారు. అప్పటికే 6గంటల న్యూస్ లో ఎమ్మెల్యే గాంధీ మధిర కౌన్సిలర్ వాసు, వల్లభనేని వంశీలని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. న్యూస్ టెంపో ఎందుకు తగ్గించాలి. దీనికి లాజికల్ కన్ క్లూడ్ రావాలన్న అభిప్రాయంతో అప్పటికప్పుడు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో దీనికోసం మరో యుద్ధమే చేయాల్సి వచ్చింది.

అప్పటికే స్టూడియోలో మాకు TRS గెస్టు MLA జీవన్‌ రెడ్డి వచ్చి సిద్ధంగా ఉన్నారు. అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా NVSS ప్రభాకర్‌ వెయిటింగ్‌. కాంగ్రెస్ TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ రెడీ. అయితే చివరి నిమిషంలో గెస్టులకు కూడా 5 నిమిషాలే అని చెప్పి వెయిటింగ్ లో పెట్టి వాసును లైవ్లోకి తీసుకున్నాం. తర్వాత గాంధీ లైవ్ లోకి వచ్చారు. అలా మొదలైన షో… అసలు చర్చ పక్కకుపోయి సరికొత్త టర్న్ తీసుకుంది

ముగింపు అనుకుంటే మళ్లీ మొదలైంది

గాంధీ సలహానో… లేక చేసిన తప్పును తెలుసుకున్నాడో మొత్తానికి వాసు తప్పేనని అంగీకరించాడు. దీంతో చర్చ ముగిద్దామనుకున్నాం. సరిగ్గా క్లోజ్ చేయడానికి ఒక్కనిమిషం ముందు డిప్యూటీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ అశోక్‌ వేములపల్లి పీసీఆర్‌కు వచ్చి వల్లభనేని వంశీ ఫోన్‌ ఇన్‌ ఇస్తాడట అన్నారు. ఏం చేయాలతో తెలియలేదు. ముందుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో అసలు చర్చే వద్దనుకున్నాం.. ఆయనే వస్తాననడంతో ఆలోచించాం. మల్లాది వాసు ఎపిసోడ్ ముగిసింది అవసరమా అన్నారు రజనీకాంత్. కానీ అశోక్ మాత్రం వాసు సారీ చెప్పాడు కాబట్టి వంశీ కూడా దీనిపై క్లారిఫికేషన్ ఇస్తే కన్ క్లూడ్ అవుతుందన్నారు. దీంతో నేను, రజనీకాంత్ సరే అన్నాం. గాంధీని లైవ్లోనే ఉంచి వంశీ వస్తారంటూ టీజర్ ఇచ్చి చిన్న బ్రేక్ ఇచ్చాం. ఎమ్మెల్యే గాంధీ కూడా వంశీతో చర్చకు సై అన్నారు. అలా 7.10 వద్ద ముగించాల్సిన చర్చ మళ్లీ మొదలైంది.

సారీ… ఇది ఊహించలేదు..

బ్రేక్‌ ఇచ్చి మళ్లీ డిస్కషన్‌ కంటిన్యూ చేశాం. వల్లభనేని వంశీ, గాంధీ డిస్కషన్‌లో పాల్గొన్నారు. వాస్తవానికి వంశీ ఫోను కలవడానికి కూడా ఈ సమయంలో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ల్యాండ్‌లైన్‌ నుంచి కలవడం లేదు. చివరకు మొబైల్‌ ద్వారా కలిపి దీనిని ల్యాండ్‌లైన్‌కు కాన్ఫరెన్స్‌ కాల్‌ పెట్టాం. వంశీ లైవ్‌లో హలో అనే వరకు నమ్మకం లేదు. క్యాన్సిల్‌ చేద్దామనుకుంటున్న సమయంలో ఎలాగో లైన్‌లోకి వచ్చారు. దీంతో ఎపిసోడ్ కొత్త రూపు సంతరించుకుంది. కొందరు అసలు సారీ చెప్పాడా? ఎక్కడ అన్నారు. వీడియోలో ఎక్కడ ఉంది అంటారు. సరిగ్గా వింటే ఆయన మాటలు అర్థమవుతాయి. ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ‘మహిళల పట్ల వ్యాఖ్యలు చేశారని.. కులాన్ని అన్నారనీ అలాగే కొందరు వ్యక్తులు బాధపడ్డారు. మీ పట్ల ద్వేషం వెళ్లగక్కే పరిస్థితి ఉంది’ అని వంశీని ఉద్దేశించి రజనీకాంత్ నేరుగానే ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని టీడీపీ ట్రోల్‌ చేస్తుందని.. ఆవేదనలో మాట్లాడానని అక్కడ తప్పు దొర్లిందన్నారు. అంతే రజనీకాంత్ కు ఆయుధం దొరికింది. ఇక వదల్లేదు.. ‘‘సోషల్‌ మీడియా చెత్త అంతా పోగేసి మరీ రాజకీయాల్లో జొప్పించడం ఏంటి. మీరు చేసిన వ్యాఖ్యలతో ఓ కులం, నందమూరి కుటుంబం అంతా బాధపడటం నిజం కాదా’ అంటూ రజనీకాంత్‌ స్ట్రాంగ్‌గానే వంశీని నిలదీశారు. దీంతో వంశీ తన మాటల్లో తప్పు దొర్లిందన్నారు.

ఇక ‘మీ కామెంట్లకు రియలైజ్‌ అవుతున్నారా‘ అంటే.. తడుముకోకుండా వంశీ తప్పును ఒప్పుకున్నారు. అలా మాట్లాడి ఉండకూడదు.. నాకు అత్యంత ఆత్మీయరాలు, అక్కా అని పిలుస్తా ఆమెను అనడం తప్పే అంటూ చెప్పుకొచ్చారు. తప్పకుండా క్షమించమని అడుగుతా. ఎవరిని అలా అన్నా తప్పే. ఆమె మాత్రమే కాదు.. నా మాటలతో బాధపడిన అందరికీ క్షమాపణ చెబుతున్నా అన్నారు వంశీ. తన మాటలకు వంశీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చేసిన తప్పును గ్రహించి పొరపాటుకు చింతిస్తున్నట్టు ప్రకటించారు. అలా డిస్కషన్ కంటిన్యూ అయింది. ముందుగా అనుకున్న సబ్జెక్టు గెస్టులను తిప్పి పంపాము.

వల్లభనేని వంశీ ‘సారీ’ వెనక జరిగింది ఇది. యాదృశ్చికంగా జరిగిన చర్చే.. కావాలని ముందుగా నిర్ణయించింది కాదు. ప్రైమ్‌ టైమ్‌లో బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌ ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా నాకు ఇదో అనుభవం. చాలా సందర్భాల్లో షో విషయంలో ఎంతోమంది సహకరిస్తారు. నిత్యం అందరితో మాట్లాడుతూ ఏయే అంశాలు ఉండాలో తెలుసుకుంటాను. ఇలా జరుగుతున్న ప్రయాణంలో అనూహ్యంగా డిసెంబర్‌1న జరిగిన చర్చ ప్రత్యేక అనుభూతి.. అనుభవాలను ఇచ్చింది. వంశీ సారీ చాలా పెద్ద విషయం మొల్లగా తర్వాత నాకు అర్థమైంది. ఏదో అనుకుని చర్చను మొదలుపెడితే మరో రూపంలో రాజకీయ సంచలనంగా మారింది. అందుకే దీనిపై నా అనభవాలు వెబ్ లో పంచుకోవాలనుకున్నాను.

ఐడియా ఇచ్చిన బ్రేకింగ్‌

చివరి నిమిషంలో నాకు వచ్చిన ఐడియాను రజనీకాంత్‌తో పంచుకోవడం.. ఆయన అంగీకరించడం యాదృశ్చికం. ఆఖరి నిమిషంలో వచ్చిన ఐడియా బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ను మోసుకొస్తుందని ఊహించలేదు. అయితే దీనిపైనా భిన్నాభిప్రాయాలు… రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు వంశీ సారీ ఎక్కడ చెప్పారని కొందరన్నారు. ఇంకొందరు అంతా నాటకం, కావాలని నడిపించారని ట్రోల్‌ చేస్తున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి అనుకూలంగా మలుచుకుని దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం చూసి నాకు దీని వెనక జరిగిన నాటకీయ కోణం జనాలకు తెలిసేలా రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వాస్తవానికి వంశీ వ్యాఖ్యలను అనుమతించడం మీడియా బాధ్యత.

ఆయన ఏం చెప్పాలని.. ఎలా చెప్పాలి దేనిపై మాట్లాడాలన్నది డిబేట్‌కు వచ్చేవారి స్వేచ్ఛకు సంబంధించినది. వంశీ సారీ చెప్పడం సరికాదని వైసీపీలో ఓ వర్గం అంటోంది. ఎవరికి కావాలి ఆయన క్షమాపణ అని మరో పార్టీ అంటోంది. కావాలని చర్చ పెట్టారని ఒకరంటారు. కానీ అసలు వాస్తవం తెలిసిన నేను ఇలాంటి సంచలనాల వెనక జరిగిన నిజాలు పంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే రాయాల్సి వచ్చింది. ఇక ముందు కూడా ఇలాంటి సంచలన వార్తల వెనక కోణాలు రాస్తూనే ఉండాలని నిర్ణయించాను.

రమేష్‌ యల్లంకి, టీవీ9 తెలుగు, హైదరాబాద్‌.