Big News Big Debate: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు కేసీఆర్ వరుస ప్రకటనలే ఎలక్షన్లకు సంకేతాలంటోంది కాంగ్రెస్ పార్టీ. సీఎం చర్యలు ఊహాతీతమంటున్న కమలనాథులు హస్తినలో అప్పుడే రోడ్‌మ్యాప్ కూడా సిద్దం చేసుకుంటున్నారు. 2023 డిసెంబర్ వరకూ సమయం ఉన్నా తెలంగాణలో ముందుగానే ఎన్నికలొస్తాయన్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంంది.
తెలంగాణలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ముందస్తు ఎన్నికలపై చర్చతో రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ యాక్షన్ డోస్ పెరిగింది.గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యత పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడో ఇచ్చిన ఎన్నికల హామీలకు దుమ్ముదులిపి మరీ పద్దుల్లో చేర్చింది. ఉద్యోగాలపై జంబో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక మంత్రులు జిల్లాల పర్యటనల్లో దూకుడు పెంచుతున్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతాలని అంటోంది కాంగ్రెస్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామంటున్న హస్తం పార్టీ విజయంపై ధీమాగా ఉంది.
ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత ఫుల్ స్వింగ్‌లో ఉన్న కమలనాథులు కూడా రాష్ట్రంపై ఫోకస్ చేశారు. సౌతిండియాకు గేట్‌వే అయిన తెలంగాణలో జెండా ఎగరేయడానికి జాతీయ నాయకత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు పార్టీ లోకల్ లీడర్స్ ప్రకటించారు. వేల కోట్ల బ్లాక్‌మనీ, పీకే వ్యూహాలతో వస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో షాకిస్తామంటోంది బీజేపీ.
అటు అధికారపార్టీలోనూ ముందస్తుపై చర్చ జరుగుతోంది. మంత్రులు బయటపడకపోయినా క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు తమకు సంకేతాలున్నాయంటూ సన్నిహితుల వద్ద షేర్ చేసుకుంటున్నారు. అటు విపక్షాలపై విమర్శల దాడి పెంచారు అధికారపార్టీ నాయకులు. తెలంగాణ వికాసం టీఆర్ఎస్ విధానం అయితే… విధ్వంసం బీజేపీ నినాదమంటోంది. గతంలో కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకులకు ఊడిగం చేస్తే.. ప్రస్తుత తెలంగాణ బీజేపీ నేతలు గుజరాత్ నాయకుల వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని సెంటిమెంట్ రాజేస్తోంది TRS.
మొత్తానికి తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మరి ముందస్తుకు సీఎం వెళతారా? డిసెంబర్‌లో జరిగే గుజరాత్ ఎన్నికలతో పాటే ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని విపక్షాలు అంటున్న మాటలు నిజమవుతాయా?
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..