TRS and BJP fight on Paddy Procurement: ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. బాధ్యత నుంచి కేంద్రమే తప్పించుకుంటోందని TRS ఎటాక్ చేస్తోంది. అటు రెండు రోజుల నుంచి కలిసేందుకు సమయం అడిగినా ఇవ్వకుండా BJP రాష్ట్ర నేతలను కలుస్తారా అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌పై నిప్పులు చెరిగారు. అయితే, ఎవరిని అడిగి వచ్చారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు కేంద్రమంత్రి. ఢిల్లీలో పంచాయితీ ఇలా నడుస్తుండగానే.. దూకుడు ఇంకా పెంచాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ కమలదళానికి దిశానిర్దేశం చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వచ్చిన తెలంగాణ మంత్రులు ఎట్టకేలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. అయితే అపాయింట్‌మెంట్ వ్యవహారం మాటల యుద్ధానికి తెరతీసింది. ముందు అడిగిన తమకు సమయం ఇవ్వకపోగా బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి తమపైనే విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనంటూ మండిపడుతున్నారు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు. మా బిజీలో మేమున్నామని ఎవరిని అడిగివచ్చారని.. పనిలేక ఇక్కడకు వచ్చినట్టుగా ఉందంటూ పియూష్ గోయల్ చేసిన కౌంటర్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
గత రబీ, ఖరీష్ అగ్రిమెంట్లు పూర్తిచేయకుండా వచ్చే రబీపై ఢిల్లీ వచ్చి రాజకీయం చేయడం ఏంటని మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. 27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే ఇంకా సేకరించలేదన్నారు పీయూష్ గోయల్. తెలంగాణ CM KCR వరుస ఓటములతో పరేషాన్ అవుతూ ప్రజల్ని కూడా అయోమయంలో పడేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రులు.
ఆలస్యం అయినా అపాయంట్‌మెంట్ రావడంతో పీయూష్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు 90లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం సేకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై రాతపూర్వక హామీ కోసం పట్టుబట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలా.. లేదా అన్నది కేంద్రం ఇచ్చే సమాధానంపై ఆధారపడి ఉంటుందన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన.
ఇటు వరిపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య చర్చలు నడుస్తుండగానే అటు రాష్ట్ర బీజేపీ నాయకులు అమిత్‌షాతో భేటి అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, TRSను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచాలని ఫుల్ క్లారిటీ ఇచ్చిన అమిత్ షా త్వరలోనే రెండు రోజుల పర్యటనకు వస్తున్నట్టు నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2023 ఎన్నికలు అజెండాగా పెట్టుకుని నిరంతరం ప్రజల్లో ఉండాలన్నారు అమిత్‌షా.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.