Big News Big Debate: హస్తంతో డీల్‌ – గులాబీతో ములాఖత్.. కేసీఆర్‌కు పీకే చెప్పిన ముచ్చటేంటి?..

Big News Big Debate: ప్రశాంత్ కిషోర్ మనసు కాంగ్రెస్‌ వైపు లాగుతోంది.. ఆయన సేవలు టీఆర్ఎస్ కోరుకుంటోంది. హస్తం పార్టీకి ఢిల్లీలో నివేదిక ఇచ్చి అధినేత్రి పిలుపుకోసం ఎదురుచూస్తున్న ప్రశాంత్‌కిషోర్‌..

Big News Big Debate: హస్తంతో డీల్‌ - గులాబీతో ములాఖత్.. కేసీఆర్‌కు పీకే చెప్పిన ముచ్చటేంటి?..
Big News
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 25, 2022 | 10:13 PM

Big News Big Debate: ప్రశాంత్ కిషోర్ మనసు కాంగ్రెస్‌ వైపు లాగుతోంది.. ఆయన సేవలు టీఆర్ఎస్ కోరుకుంటోంది. హస్తం పార్టీకి ఢిల్లీలో నివేదిక ఇచ్చి అధినేత్రి పిలుపుకోసం ఎదురుచూస్తున్న ప్రశాంత్‌కిషోర్‌.. హైదరాబాద్‌ వచ్చి సీఎం కేసీఆర్‌తో ములాఖత్‌ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. సోనియాగాంధీ నిర్ణయం ఎలా ఉంటుందో కానీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. వ్యూహకర్త ఎపిసోడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆయన లక్ష్యమేంటో? రీజనల్‌ పార్టీలతో ట్రావెల్‌ ఎంటో అర్ధం కావడం లేదంటున్నారు లోకల్‌ లీడర్స్‌.

పీకే.. పీకే.. పీకే.. గత మూడురోజులుగా పీకే నామస్మరణతో మార్మోగుతోంది తెలంగాణ. కేసీఆర్‌తో PK వరుస సమావేశాలతో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన పీకే నివేదిక కూడా ఇచ్చారు. పార్టీలో చేరిక ఖాయమైందన్న ప్రచారమూ జరిగింది. సోనియా వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో నేరుగా హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో పెద్దఅలజడి రేపింది. పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శత్రువును కలిసి మిత్రుడిని కూడా నమ్మొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ రూపంలో PKపై కామెంట్‌ చేశారు. మరోవైపు పీకే మావాడే కేసీఆర్‌తో డీల్‌ రద్దు చేసుకోవడానికే వచ్చారంటూ చెబుతోంది పీసీసీ.

కాంగ్రెస్ ముక్త్‌ భారత్‌ నినాదంతో బీజేపీని గెలిపించిన పీకే.. అందులో భాగంగానే వ్యూహంలో ఉన్నారా గల్లీ హస్తం లీడర్స్‌లో ఆందోళన ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో అలజడి అలా ఉంటే గులాబీ శ్రేణుల్లో కూడా కలవరం మొదలైంది. పీకేతో కలిసి పనిచేస్తామని కేసీఆర్‌ సాధికారికంగా ప్రకటించారు. తీరా చూస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ సిద్దమయ్యారు. మన లోటుపాట్లు తెలుసుకుని ఎక్కడ బొక్క పెడతారోనని టీఆర్ఎస్‌ శ్రేణల్లోనూ అనుమానం వ్యక్తమవుతోంది. పీకే తమతో ఉండకపోయినా సంస్థ ఐప్యాక్‌ పనిచేస్తుందంటున్నారు కొందరు గులాబీ నేతలు. మనిషి లేకుండా ఆయన కంపెనీ మనుషులు పనిచేయడం సాధ్యమవుతుందా? దీనికి తోడు కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు కూడా పీకే చేస్తారన్న ప్రచారం ఈ పార్టీలో కంగారు పుట్టిస్తోంది. అయితే పొత్తులపై ఎలాంటి చర్చా లేదంటోంది పార్టీ. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పీకే స్ట్రాటజీలో పొత్తు ప్రస్తావనే లేదంటోంది.

పార్టీల వెర్షన్‌ ఎలా ఉన్నా ఢిల్లీలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని నివేదికలు ఇచ్చిన పీకే.. తెలంగాణలో అదే పార్టీ ఓటమికి పనిచేయాలనుకోవడం విచిత్రంగా ఉంది. ఆయన తీరును గమనిస్తున్న వాళ్లు పొలిటికల్‌ గ్యాంబ్లర్‌ అంటూ విమర్శిస్తున్నారు. మరి ఆయన ఎవరిని గెలిపించడానికి రంగంలో దిగుతారు. ఎవరిని ఓడించడానికి కంకణం కట్టుకుంటారు? వెయిట్‌ అండ్‌ సీ అంటోంది ఐ ప్యాక్‌ సంస్థ.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.

ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..