Big News Big Debate: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు, హిందీ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇలా వరుసగా పేపర్లు లీకవడం సంచలనంగా మారింది. రాజకీయంగానూ సరికొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యమే కారణమని విపక్షాలు విమర్శిస్తుంటే.. సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా తెలుగుదేశం కావాలని లీకులు చేస్తోందని ఆరోపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఏపీలో టెర్త్ ఎగ్జామ్ పేపర్లు లీక్. ఒక్కటికాదు.. రెండు కాదు వరుసగా నాలుగు పేపర్లు లీకయ్యాయి. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ వచ్చాయి. మొదటి మూడు రోజులు పరీక్ష ప్రారంభమైన కాసేపటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పేపర్ వాట్సప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టాయి. ఇక పరీక్షకు ముందే మ్యాథ్స్ పేపర్ బయటకు వచ్చింది. మొత్తం 60 మందిపై క్రిమినల్ కేసులు పెట్టింది ప్రభుత్వం. అరెస్టు చేసిన 60 మందిలో 36 మంది టీచర్లు, మరో ఇద్దరు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై ఆరోపణలున్నాయి. అరెస్టయిన వారిలో నారాయణ సంస్థకు చెందిన ఓ వైస్ ప్రిన్సిపల్ సహా 22 మందిపై కేసులు నమోదయ్యాయి.
ప్రశ్నాపత్రాలను ఫొటో తీసి వాట్సాప్‌లో బయటకు పంపి లీకు చేసే ప్రయత్నం చేసింది టీడీపీ మద్దతుదారులే అన్నారు సీఎం జగన్. రెండు ప్రాంతాల్లో నారాయణ మరో రెండు ప్రాంతాల్లో చైతన్య స్కూళ్లలో లీక్ అయ్యాయన్నారు ముఖ్యమంత్రి. నారాయణ విద్యాసంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. ప్రభుత్వ పథకాలపై జనాల్లో చర్చ జరగకుండా రాజకీయ కుట్రలో భాగంగా లీకులు చేశారని ఆరోపించారు ఏపీ సీఎం.
సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా లీకుల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం వైఫల్యమే అంటున్నాయి. పరీక్షలు నిర్వహించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. మరి నిజంగానే ప్రభుత్వం విఫలమైందా? లేక రాజకీయంగా కుట్ర జరుగుతుందా? రాజకీయాలతో సంబంధం లేకుండా కార్పొరేట్ సంస్థల దందాలో భాగంగానే లీక్ అవుతున్నాయా?
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..