Telugu News Astrology Venus Transit in Taurus: These Zodiac Signs to Experience Happiness in Family and Married Life
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!
Venus Transit: ఏప్రిల్ 20 నుంచి మే 14 వరకు వృషభ రాశిలో శుక్రుడి సంచారం ప్రభావంతో మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశంతో పాటు కుటుంబ సమస్యలు తగ్గి, ఐశ్వర్యం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.
ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ధన ధాన్య సమృద్ధికి బాగా అవకాశం ఉంది.
వృషభ రాశిలో శుక్రుడి సంచార ప్రభావం ఆరు రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం..
మేషం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడే సంచారం చేయడం వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల ఆదాయంలో బాగా వృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలే కాక, కుటుంబ సమస్యలు కూడా మటుమాయం అవుతాయి. జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలున్నా సమసిపోయి, సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఇష్టమైన బంధువుల రాకపోకలు పెరుగుతాయి.
వృషభం: స్వక్షేత్రమైన వృషభ రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి కుటుంబపరంగా ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. ఇంట్లో సఖ్యత, సాన్నిహిత్యం, సామరస్యం నెలకొంటాయి. అపా ర్థాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి స్వక్షేత్ర సంచారం వల్ల కుటుంబానికి కొత్త అదృష్టాలు పడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడం, మరొకరికి విదేశాల్లో ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి. ఇంట్లో ఒకరికి సంతాన యోగం కూడా కలుగుతుంది. శుభ కార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు ఎక్కువగా హాజరు కావడం కూడా జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, కుటుంబ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి.
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి కుటుంబపరంగా, వైవాహికంగా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య ఎటువంటి పొరపచ్చాలున్నా, వివాదాలున్నా సమసిపోతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల కోసం భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతాన యోగం కలిగే సూచనలున్నాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు.
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంటికి ఇష్టమైన బంధువులు రావడం జరుగుతుంది. పిల్లలు చదువుల్లో లేదా ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలు వింటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విహార యాత్రలు, తీర్థ యాత్రలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం చాలావరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబంలో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వాహన యోగం పడుతుంది. ఆరోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.