Shukra Gochar: మేష రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టబోతున్నాయ్..!

Venus Transit 2025: జ్యోతిష్య రీత్యా ప్రేమలు, పెళ్లిళ్లు, విలాసాలు, సుఖ సంతోషాలకు శుక్ర గ్రహాన్ని కారకుడిగా పరిగణిస్తారు. మే 31 నుండి జూన్ 29 వరకు శుక్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో మేషం, మిథునం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రేమ, వివాహం, ఆర్థిక విషయాలలో అభివృద్ధి ఉంటుంది. కొన్ని రాశులకు రాజయోగాలు, ఆస్తి లాభాలు కూడా కలుగుతాయి.

Shukra Gochar: మేష రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టబోతున్నాయ్..!
Raja Yoga

Edited By:

Updated on: May 21, 2025 | 4:02 PM

Venus Transit in Aries: ప్రేమలు, పెళ్లిళ్లు, విలాసాలు, సరదాలు, సుఖ సంతోషాలు, శృంగారం, ఆడంబరాలు, అలంకరణలు వంటి అంశాలకు కారకుడైన శుక్రుడు తనకు ఉచ్ఛ స్థానమైన మీన రాశి నుంచి మే 31న మేష రాశిలోకి మారడం జరుగుతోంది. కుజ క్షేత్రమైన మేష రాశి శుక్రుడికి అనుకూల స్థానం కానప్పటికీ, కొన్ని రాశులకు రాజయోగాలను, విలాసవంతమైన జీవితాన్ని, సుఖ సంతోషాలను ఇవ్వడం జరుగుతుంది. జూన్ 29 వరకు మేష రాశిలో కొనసాగే శుక్రుడు మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులకు సుఖ సంతోషాలనిస్తాడు.

  1. మేషం: ఈ రాశిలో సంచారం ప్రారంభిస్తున్న శుక్రుడు సాధారణంగా ఈ రాశివారిలో కోరికలు పెంచే అవకాశం ఉంటుంది. అతి కాముకత్వాన్ని కలిగిస్తాడు. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆడంబరంగా, విలాసవంతంగా జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. ఈ రాశికి శుక్రుడు ధనాధిపతి అయినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది.
  2. మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి నిశ్చయం కావడం గానీ జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీ మూలక ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది.
  5. తుల: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విలాస జీవితం అలవడుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.