Surya Gochar 2023
Surya Gochar 2023: ఈ నెల 17న రవి గ్రహం సింహరాశిలో ప్రవేశించబోతోంది. ఇక్కడ అది సెప్టెంబర్ 17 వరకూ కొనసాగుతుంది. సింహ రాశి రవి గ్రహానికి స్వక్షేత్రం. అయితే, ఇప్పటికే ఈ రాశిలో ఉన్న మిత్ర గ్రహం కుజుడితో యుతి చెందడం, కుంభ రాశిలో ఉన్న శనీశ్వరుడితో సమ సప్తమ వీక్షణ కలగడం వల్ల కొన్ని రాశుల వారికి పురోగతి చెందే అవకాశం కల్పిస్తుండగా, మరికొన్ని రాశులకు కష్టనష్టాలు తెచ్చి పెట్టడం జరుగుతుంది. మేష, మిథున, తుల, వృశ్చిక, ధనుస్సు, మీన రాశి వారికి రాజయోగం కలిగించే అవకాశం ఉంది. అయితే, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర, కుంభ రాశి వారికి కష్టనష్టాలు తీసుకు వచ్చే సూచనలున్నాయి. ఏయే రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇక్కడ చూద్దాం.
- మేషం: ఈ రాశివారికి ఈ రకమైన గ్రహాల కలయిక వల్ల శుభమే జరుగుతుంది. గట్టి పట్టుదలతో తమ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగా లబ్ధి పొందడం జరుగుతుంది. జాతకుల్లో మొండి ధైర్యంతో పాటు
తెగువ, ఆత్మవిశ్వాసం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జీవిత గమ్యం చాలావరకు మారుతుంది. ఈ జాతకుల వల్ల వీరి పిల్లలు విశేషంగా ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, రాజకీయ రంగంలోని వారికి ఇది కలిసి వస్తుంది.
- వృషభం: ఈ రాశివారికి ఈ కుజ, రవుల కలయిక, రవి, శనుల వీక్షణ వల్ల మనశ్శాంతి తగ్గడం, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం, కుటుంబంలో తీవ్ర స్థాయి సమస్యలు తలెత్తడం వంటివి జరగవచ్చు. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో, భూమిక్రయ విక్రయాలలో ఎంతో జాగ్రత్త వహించాలి. గృహ, వాహన ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం కాదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు తప్పటడుగులు పడకుండా చూసుకోవాలి.
- మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానం మీద రవి, కుజ, శనీశ్వరుల వంటి పాప గ్రహాల ప్రభావం పడినందువల్ల మొండి పట్టుదల, తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి గుణాలు ఎక్కువవుతాయి. వీరి ప్రయత్నాలన్నీ విజయవంతం అయి, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. తప్పకుండా ఆదాయ వృద్ధికి ఆస్కారముంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. కనిష్ట సోదరులకు, మిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి కుటుంబ, ధన స్థానంలో ఈ గ్రహాల సంయోగం జరుగుతున్నందువల్ల, కుటుంబ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మోసపోవడం గానీ, నష్టపో వడం గానీ జరుగుతుంది. ఎవరితోనైనా ఏ విషయంలోనైనా ఒప్పందాలు కుదర్చుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు, సమస్యల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడినా అపార్థాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.
- సింహం: సాధారణంగా సింహ రాశిలో ఈ రాశినాథుడైన రవి ప్రవేశించినప్పుడు ప్రతి పనీ, ప్రతి వ్యవహారం సానుకూలపడే అవకాశం ఉంటుంది. అయితే, రవి గ్రహంపై శని, కుజుల ప్రభావం ఉన్నందువల్ల , వాహన ప్రమాదాలకు గురి కావడం, తీవ్ర స్థాయి అనారోగ్యాలకు గురి కావడం, విషాహారం తినడం, జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడం వంటివి జరుగుతాయి. రవి గ్రహానికి బలం పెరగడానికి ఈ రాశివారు తప్పనిసరిగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం చాలా మంచిది.
- కన్య: ఈ రాశివారికి వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో ఈ గ్రహాల కలయిక జరుగుతుండడం వల్ల , నష్టాలపాలు కావడం ఎక్కువగా జరుగుతుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నేరస్థులు, మోసగాళ్ల చేతిలో చిక్కుకునే సూచనలున్నాయి. రాజకీయనాయకులు తమ ప్రాభవాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో అప్రమత్తంగా, అతి జాగ్రత్తగా ఉండని పక్షంలో భారీగా డబ్బు నష్టపోవడం, వృథా ఖర్చుకావడం జరుగుతుంది.
- తుల: ఈ రాశివారికి ఈ గ్రహ స్థితి అనుకూల ఫలితాలనే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా అధికారానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. పుర ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవడం జరుగుతుంది. విలాసాలు పెరుగుతాయి.
- వృశ్చికం: దశమ స్థానంలో ఈ గ్రహాల స్థితిగతులు చోటు చేసుకుంటున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మారడం జరగవచ్చు. నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం దొరికే ఛాన్సు ఉంది. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా కొద్దిగా అప్ర మత్తంగా ఉంటే, అంతా సవ్యంగా జరిగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దే కార్యక్రమం పెట్టుకుంటే చాలా మంచిది. వాహన ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- ధనుస్సు: ఈ రాశివారికి భాగ్య స్థానం మీద రవి, కుజ, శనుల ప్రభావం పడుతున్నందువల్ల విదేశీ సంబంధమైన విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. పితృవర్గం నుంచి సహాయ సహకా రాలు అందడమే కాకుండా, వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. తండ్రికి యోగం పడుతుంది. పిల్లలకు సంబంధించి ఏవైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల అధిక ప్రయోజనం పొందుతారు. విహార యాత్రలు జరిపే సూచనలు కూడా ఉన్నాయి.
- మకరం: ఈ రాశివారికి అష్టమ స్థానంపై ఈ గ్రహాల ప్రభావం పడుతున్నందువల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తడం, ఆర్థికంగా నష్టపోవడం, అధికారుల ఆగ్రహానికి గురికావడం, తరచూ అనారోగ్యాలకు గురికావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వాహనాలను నడపడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇతరులు మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం. స్నేహితులు తప్పుదోవ పట్టిస్తారు.
- కుంభం: సప్తమ స్థానంలో పాప గ్రహాల ప్రభావం పడుతున్నందువల్ల వైవాహిక జీవితంలో, దాంపత్య జీవి తంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మరింత పారదర్శకంగా వ్యవహ రించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని గానీ, ఇతర కుటుంబ సభ్యులను గానీ సంప్రదించడం మంచిది. వాహనాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆహార, విహా రాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు.
- మీనం:ఈ రాశివారికి ఆరవ స్థానంలో పాప గ్రహ సంయోగం జరుగుతున్నందువల్ల, ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా చాలావరకు బయటపడే అవకాశం ఉంటుంది. తల్లి తరఫు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి.
ముఖ్యమైన పరిహారాలు: రవి గ్రహం తన స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల నష్టపోతున్నవారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం లేదా సుందరకాండ పఠించడం మంచిది. చెడు ఫలితాలు తగ్గడం, దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. అదృష్టవశాత్తూ, బుద్ధి కారకుడైన బుధ గ్రహం సింహ రాశిలోనే ఉండడం, ఈ నెల 21న కుజుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి వెళ్లిపోవడం, ఈ గ్రహాల మీద గురు దృష్టి ఉండడం
వల్ల దుష్ఫలితాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. బద్ధ శత్రువులైన రవి, శనిగ్రహాలు పరస్పర వీక్షణం కలిగి ఉండడం మాత్రం ప్రమాదకరమే. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడమే మంచిది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి