Telugu Astrology
రవి, శని గ్రహాలు తండ్రీ కొడుకులే అయినప్పటికీ, ఇవి రెండూ బద్ధ శత్రువులు. ఇవి రెండు కలిసి ఉండడం గానీ, ఒకరినొకరు చూసుకోవడం కానీ, కొన్ని రాశులకు ఏమాత్రం మంచిది కాదు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 16 వరకూ ఇవి పరస్పరం వీక్షించుకోవడం జరుగుతుంది. ఈ నెల 16న తన స్వస్థానమైన సింహ రాశిలో ప్రవేశిస్తున్న రవిని, తన స్వస్థానమైన కుంభరాశి నుంచే శని వీక్షించడం జరుగుతుంది. ఇవి తమ తమ స్వస్థానాల్లో ఉన్నందువల్ల మరింత బలంగా వ్యవహరించడం జరుగుతుంది. ఉద్యోగాల్లో అధికారులతోనూ, కుటుంబంలో తండ్రితోనూ, బయట ప్రభుత్వంతోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతానికి వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు బాగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది.
- వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, దశమ స్థానంలో శని ఉండి ఒకరినొకరు చూసుకుంటున్నందువల్ల ఆస్తి విషయంలో తండ్రితో వివాదానికి దిగే అవకాశం ఉంది. తండ్రితో గానీ, ఉన్నతాధికారులతో గానీ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అధికారులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఉద్యోగం మారడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. రాజీపడని ధోరణి, మొండి వైఖరి వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ జీవితంలో కొన్ని అనవసర సమస్యలు తలెత్తవచ్చు. మనశ్శాంతి తగ్గుతుంది.
- కర్కాటకం: అర్ధాష్టమ శని కారణంగా కొద్దిగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ రాశివారు ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ కారణంగా మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సమ స్యలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆస్తి వివా దాలు ముదిరి కోర్టు వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. మాట తొందరపాటుతనం వల్ల ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రతివారితోనూ వీలైనంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
- సింహం: రాశ్యధిపతి రవి, సప్తమాధిపతి శని పరస్పరం వీక్షించుకుంటున్నందువల్ల జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంది. తండ్రి, కుమారుల మధ్య వైషమ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆదాయ పన్ను, సుంకాలు వగైరా విషయాల్లో ప్రభుత్వం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.
- వృశ్చికం: ఈ రాశివారికి ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ వల్ల ఉద్యోగానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా అధికారుల వల్ల తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు బంధువులు నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందల లభించకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు కూడా బాగా మంద గిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో గానీ, ఆస్తి విషయాల్లో గానీ తండ్రితో విభేదించడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడి మీద అష్టమాధిపతి రవి దృష్టి పడడం వల్ల ఆస్తి వివాదాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితంలో చికాకులు తలెత్తుతాయి. పని భారం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో మీ మీద చెడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం, వాదోపవాదాల్లో కల్పించుకోవడం వంటి వాటి వల్ల ఇబ్బంది పడతారు.
- కుంభం: రాశ్యధిపతి శనీశ్వరుడి మీద సప్తమ స్థానం నుంచి రవి దృష్టి పడినందువల్ల కుటుంబ జీవితం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి. పెళ్లి సంబం ధాలు వెనక్కు వెడతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ప్రభుత్వ మూలక ధన నష్టం ఉంటుంది. తండ్రి ఆగ్రహావేశాలకు గురవుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు, విమర్శలు ఉంటాయి. పని భారం బాగా పెరిగి విశ్రాంతికి చాలావరకు దూరమవుతారు.