
Money Astrology 2025
ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న కుజుడు అష్టమ దృష్టితో మీన రాశిలో ఉన్న శనీశ్వరుడిని వీక్షించడం జరుగుతోంది. దీనివల్ల, శనీశ్వరుడిలో బలం, వేగం బాగా పెరుగుతాయి. సాధార ణంగా మందగమనంతో నడిచే శనీశ్వరుడు ఇక కుజుడి మాదిరిగా వేగంగా, చురుకుగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల జూలై 28 వరకు కొన్ని రాశులకు తప్పకుండా లాభాలు కలుగుతాయి. ముందుగా ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి ధనయోగాలు పట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఈ రాశివారికి అనేక విధాలుగా లాభాలు కలిగించాల్సి ఉంది. ఆలస్యాలకు, కాలయాపనలకు కారకుడైన శని శుభాలనివ్వడంలో జాప్యం చేసే అవకాశం ఉంటుంది. నాలుగవ స్థానంలో ఉన్న కుజుడి దృష్టి ఈ శని మీద పడినందువల్ల శని చురుకుగా, వేగంలో యోగాలనివ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడం వంటివి జరుగుతాయి.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఉద్యోగంలో పదోన్నతులు రాకపోవడం, ఎదుగూ బొదుగూ లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించకపోవడం, ప్రయత్నాలేవీ ఫలించకపోవడం, ఆదాయం వృద్ధి చెందకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి దృష్టి శని మీద పడినందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరగడం, పదోన్నతులు లభించడం, ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం వంటివి జరగాల్సి ఉంది. శనీశ్వరుడి మందగమనం వల్ల వీటికి అవరోధాలు ఏర్పడడం జరుగుతుంది. లాభ స్థానంలో ఉన్న కుజుడి దృష్టి పడినందువల్ల శని ఈ రాశివారికి ఇక ఉద్యోగ యోగాలు, ఆర్థిక యోగాలు, సమస్యల పరిష్కారం, కార్యసిద్ధి వంటివి కలిగించే అవకాశం ఉంది.
- వృశ్చికం: శని మీన రాశిలోకి ప్రవేశించడంతో రెండున్నరేళ్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడిన ఈ రాశివారికి ఆదాయం వృద్ధి చెందడం, హోదాలు పెరగడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, శుభ కార్యాలు జరగడం వంటివి జరగాల్సి ఉంది. దశమంలో ఉన్న రాశ్యధిపతి కుజుడి దృష్టి ఈ శని మీద పడినందువల్ల శనిలో చురుకుదనం పెరిగి, పదోన్నతులు కలగడం, ఆదాయం వృద్ధి చెందడం, కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
- మకరం: సుమారు మూడు నెలల క్రితం ఏలిన్నాటి శని దోషం తొలగిపోయినప్పటికీ ఈ రాశివారికి యోగాలు పట్టకపోవడం, ప్రతి పనీ ఆలస్యం కావడం జరిగే అవకాశం ఉంది. మందగ్రహమైన శనిని చురుకైన శనిగా కుజుడు మార్చే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో ఉన్న కుజుడి దృష్టి శని మీద పడినందువల్ల శనిలో మార్పు వచ్చి, ఆదాయాన్ని పెంచడం, ఆదాయ మార్గాలను విస్తరించడం, పదోన్నతులు కలగడం, కొత్త ఉద్యోగావకాశాలు అందడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశి మీద నుంచి నిష్క్రమించి ధన స్థానంలో ప్రవేశించిన రాశ్యధిపతి శని వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగాల్సి ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందాల్సి ఉంది. వీటిని నిర్వర్తించాల్సిన శని మీద సప్తమ స్థానం నుంచి కుజుడి దృష్టి పడినందువల్ల ఆదాయం క్రమంగా వృద్ది చెందడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, జీతభత్యాలు పెరగడం వంటివి జూలై 28 వ తేదీ లోపు తప్పకుండా జరిగే అవకాశం ఉంది.