
Happy Life
సాధారణంగా కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన యాక్టివిటీ పెరుగుతుంది. ఈ రాశి వారిలో పట్టుదల, పోరాటస్ఫూర్తి, ఏకాగ్రత, చొరవ బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ నెల (ఫిబ్రవరి) 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుంభ రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి (Mars Transit) వల్ల కొన్ని రాశుల వారికి కొత్త శక్తియుక్తులు లభిస్తాయి. ఆదాయపరంగా, కెరీర్ పరంగా కొత్త మార్గాలను అనుసరిస్తారు. తమ అవసరాలకు తగ్గట్టుగా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించుకునే ప్రయత్నం జరుగుతుంది. మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు ఇనుమడిస్తాయి. లాభ స్థానం యాక్టివ్ గా మారడం వల్ల ఈ రాశివారి దృష్టి సంపాదన మీదకు, పదోన్నతుల మీదకు మళ్లుతుంది. ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానానికి వెళ్లాలనే పట్టుదల పెరుగుతుంది. ఇంత వరకూ సాహసించని ప్రయత్నాలను చేపట్టడం జరుగుతుంది. ఏప్రిల్ 2 లోగా వీరు తమ లక్ష్యాలను, ఆశయాలను సాధించుకోవడంతో పాటు మెరుగైన స్థితిలో ఉండడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ గ్రహ ప్రవేశం వల్ల ఉద్యోగంలో మరింతగా శక్తి సామర్థ్యాలను పెంచ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. మీ నుంచి అధికారులు ఎక్కువ పనిని ఆశిస్తారు. ఉద్యోగంలో పదోన్నతుల మీద దృష్టి పెడతారు. ఇతర సంస్థల్లోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రతిభా పాటవాలకు తగ్గ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్ఠలు, పలుకుబడి పెరిగే సామాజిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
- సింహం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశికి సప్తమ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి దృక్పథంలో, ఆలోచనా ధోరణిలో, వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, దూసుకుపోతారు. నాయకత్వ ప్రతిభకు అవకాశం ఉన్న వృత్తి, ఉద్యోగాల్లోకి మారే అవకాశం ఉంది. అందరినీ కలుపుకునిపోవడం ఎక్కువవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులకు, సామాజికంగా గుర్తింపునకు, ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ ప్రవేశం వల్ల సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. కొత్త ఐడియాలు, ఆలోచనలతో వృత్తి, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఒక కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉంది. పట్టుదల, ఆత్మ విశ్వాసం, సాహసాలు చేయాలన్న తాపత్రయం ఎక్కువగా కలుగుతాయి. పని చేస్తున్న సంస్థలను, వృత్తి, వ్యాపారాలను సరికొత్త ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తారు. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఆఫర్లు అందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ గ్రహ ప్రవేశం వల్ల మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇతరులతో తీవ్రస్థాయిలో పోటీ పడతారు. వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకోవడానికి పాటుబడతారు. ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే అవకాశం లేదు. ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, గృహ, వాహన సౌకర్యాలను కలిగించుకోవడం వంటి వాటిని తప్పకుండా సాధించుకుంటారు.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో కుజ గ్రహం ప్రవేశించడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి పొందడం మీద శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదలకు మారుపేరైన ఈ రాశికి కుజ బలం కూడా తోడవడంతో వీరు అతి తక్కువ కాలంలోనే తమ లక్ష్యాలను సాధించుకునే అవ కాశం ఉంది. ఆదాయ వృద్ది ప్రణాళికల్లో మార్పులు చేపడతారు. దుబారా చేసే అలవాటును తగ్గించుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు వ్యాపారాల్లో ఎంతో ధైర్యంగా పెట్టుబడులు పెంచుతారు.