Marriage
ఏ పెళ్లి విజయం కావాలన్నా కొంత ప్రయత్నం, అవగాహన, రాజీపడడం వంటివి తప్పకుండా అవసరమవుతాయి. అయితే, కొన్ని రాశుల వారికి మాత్రం ఇవి సహజ గుణాలుగా కనిపిస్తాయి. వీరు ప్రేమగా వైవాహిక జీవితం గడపడానికే పుట్టారనిపిస్తుంది. విచిత్రమేమిటంటే, వీరికి పెళ్లి తర్వాత జీవితంలో అదృష్టం ప్రారంభం అవుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీనం ఈ కోవకు చెందిన రాశులవుతాయి. ఈ సంవత్సరం వీరికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం.
- వృషభం: ఈ రాశివారు అంకితభావంతో, నీతిగా నిజాయతీగా, ఆధారపడ దగినవారుగా వ్యవహరిస్తారు. ప్రేమించడంలో, అనుబంధాన్ని పెంచుకోవడంతో వీరి తర్వాతే ఎవరైనా. ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల వీరు వివాహ బంధానికి అత్యంత విలువనిస్తారు. వైవాహిక బంధం అరమరికలు లేకుండా పటిష్ఠంగా సాగడానికి ఎంతగానో పాటుబడతారు. వివాహం తర్వాత నుంచి వీరి జీవితం అభివృద్ధి బాట పడుతుంది. ఈ ఏడాది శుక్రుడి అనుకూలత వల్ల వీరి జీవితం వైభవంగా గడిచి పోతుంది.
- కర్కాటకం: ఈ రాశివారు సున్నిత మనస్కులు. కుటుంబ జీవితం కోసం, దాంపత్య జీవితం కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడరు. జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి ఎక్కువ సమయాన్ని, ఎక్కువ సొమ్మును వినియోగిస్తుంటారు. వీరికి వివాహ మూలక ధన లాభం, వస్తు లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ప్రారంభమైన తర్వాతే వీరి పురోగతి ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు. గురు గ్రహం లాభ స్థాన సంచారం వల్ల వీరు ఈ ఏడాది సుఖ సంతోషాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.
- తుల: ఈ రాశివారు సరదాప్రియులు. హాస్య చతురత కూడా ఎక్కువే. ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా, సరదాగా తీసుకోవడం వీరికే చెల్లుతుంది. లౌకికంగా వ్యవహరించడంలో కూడా వీరు దిట్ట. ఈ రాశికి కూడా అధిపతి శుక్రుడే అయినందువల్ల, వీరి వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని వ్యవహరిస్తారు. పెళ్లి తర్వాత వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రుడి అనుకూలత కారణంగా జీవితం సామరస్యంగా సాగిపోతుంది.
- వృశ్చికం: ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి విషయంలో ఎంతో మోహంతో వ్యవహరిస్తారు. ఎంతో విధే యంగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. ప్రేమానురాగాల విషయంలో ఈ రాశివారే మొదటి స్థానంలో ఉంటారు. ఈ రాశివారు పెళ్లి తర్వాత అదృష్టవంతులవుతారు. వివాహ మూలక ధన లాభం వీరికి ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత మంచి ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగంలో పైకి ఎదగడం జరుగుతుంది. గురువు అనుకూలత వల్ల వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశివారు సాధారణంగా క్రమశిక్షణకు, నీతి నిజాయతీలకు కట్టుబడి ఉంటారు. ఏ వ్యక్తినైనా ప్రేమించడం మొదలుపెడితే గాఢంగా ప్రేమిస్తారు. జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతతో వ్యవహరించడం వీరి సహజ లక్షణం. జీవిత భాగస్వామిని వీరు అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోరు. సాధారణంగా వీరికి వివాహానంతరం అదృష్టం పడుతుంది. సంపద బాగా కలిసి వస్తుంది. ఈ ఏడాదంతా గురువు అనుకూలంగా ఉన్నందువల్ల వీరి దాంపత్య జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.
- మీనం: ఈ రాశివారికి ఓర్పు, సహనాలతో పాటు, దయా దాక్షిణ్యాలు కూడా ఎక్కువే. ప్రేమానురాగాలకు ఎంతో విలువనిస్తారు. భౌతికమైన కోరికలతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నందువల్ల జీవిత భాగస్వామి పట్ల అవగాహనతో వ్యవహరిస్తారు. సాధారణంగా ఈ రాశివారికి వివాహం తర్వాత జీవితంలో అనేక విధాలుగా స్థిరత్వం లభించడం, ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగు తుంది ఈ ఏడాదంతా గురు, శుక్రుల అనుకూలత వల్ల వీరి దాంపత్య జీవితం వైభవంగా సాగిపోతుంది.