
చంద్రగ్రహణం ముగిసింది. భారత కాలమానం ప్రకారం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు గ్రహణం కొనసాగింది. ఇది సింహరాశిలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడింది. భారతదేశంలో దీని చివరి 27 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం సమస్త జీవరాశిపై ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. గ్రహణ సమయంలో వాతావరణంలో ఉత్పన్నమయ్యే సూక్ష్మ క్రిముల వల్ల ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలను గ్రహణం పూర్తయిన తర్వాత తినకూడదు. పాలు, పెరుగు వంటి నిల్వ ఉండే పదార్థాలపై దర్భలు లేదా గరిక వేయడం వల్ల వాటి పవిత్రత చెడిపోకుండా ఉంటుంది.
గ్రహణ కాలంలో భూ వాతావరణంలో సూక్ష్మ క్రిములు, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ కారణంగా, గ్రహణానికి ముందు వండిన అన్నం, కూరలు, ఇతర ఉడికించిన ఆహార పదార్థాలు కలుషితమై విషపూరితంగా మారే అవకాశం ఉంది. వీటిని సేవించడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు సంభవించవచ్చు. కాబట్టి, గ్రహణం అనంతరం వాటిని తినకూడదని ప్రాచీన ఆయుర్వేద శాస్త్రాలు, అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకుని, తలస్నానం చేసి, వంటగదిని శుద్ధి చేసుకుని, మళ్లీ వంట చేసుకుని వేడివేడిగా ఆహారం తీసుకోవాలి.
పాలు, పెరుగు, పచ్చి కూరగాయలు, నెయ్యి, వంట నూనె, ఊరగాయ పచ్చళ్లు, ధాన్యాలు వంటి నిల్వ ఉండే పదార్థాలను పారబోయలేం కాబట్టి, వాటిపై గ్రహణ దోషం పడకుండా దర్భలు లేదా గరికను వాటి పాత్రలలో వేసి ఉంచాలని మహర్షులు సూచించారు. దర్భలకు హానికరమైన కిరణాలను గ్రహించి, సానుకూల శక్తిని వెదజల్లే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలలో సైతం రుజువైంది.
గ్రహణం విడిచిన వెంటనే ప్రతి ఒక్కరూ పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి. అంటే గ్రహణం పట్టే ముందు ఒకసారి, గ్రహణం విడిచిన తర్వాత తలారా స్నానం చేయడం అత్యవసరం. స్నానం అనంతరం ఇల్లంతా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి. ముఖ్యంగా నీళ్లలో గంగాజలం లేదా గోమూత్రం కలిపి ఇంటి మూలల్లో చల్లడం, లేదా పసుపు, కళ్లుప్పు వేసి ఇల్లంతా తుడవడం వల్ల ప్రతికూల శక్తులు నశించి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి, దేవుని పటాలు, విగ్రహాలను పవిత్ర జలంతో సంప్రోక్షణ చేసి, దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించాలి. దేవాలయాలు కూడా గ్రహణం ముగిసిన తర్వాత అర్చకులచే శుద్ధి చేయబడి, మూలవిరాట్‌కు అభిషేకాలు, సంప్రోక్షణ చేసిన తర్వాతే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తాయి. అప్పుడే దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం.
గ్రహణ సమయంలో బాహ్య ప్రపంచం స్తబ్ధంగా ఉన్నప్పుడు, సూర్యచంద్రుల ఆకర్షణ శక్తులలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో దైవనామస్మరణ, మంత్ర జపం, ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంత్ర సిద్ధి లభిస్తాయి. ఇది మానసిక, ఆధ్యాత్మిక విజ్ఞానంలో భాగం.
ముఖ్యంగా, ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడినందున, సింహరాశి, కర్కాటక రాశి, మకర రాశి, కుంభ రాశులకు చెందిన జాతకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రాశుల వారు గ్రహణాన్ని కళ్లతో చూడకూడదని, ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. మేషరాశి, మీనరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, కన్య రాశి వారికి కూడా అనుకూల లేదా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే సూచనలున్నాయి. వీరు గ్రహణం తర్వాత గ్రహణ శాంతి పూజలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ శాంతి వంటివి చేయించుకోవడం, దానధర్మాలు చేయడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చు. మిగిలిన రాశుల వారు సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది.
గర్భిణీలు, వయసు మళ్లిన వృద్ధులు, పసిపిల్లల పట్ల కుటుంబ సభ్యులంతా ప్రత్యేక శ్రద్ధ వహించి, పైన చెప్పబడిన ఆహార, విహార నియమాలను పాటించడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, భగవంతుని సంపూర్ణ కృపను పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)