Kumbha Rasi Ugadi Rasi Phalalu 2023
Image Credit source: TV9 Telugu
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో కుంభ రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యం 6, అవమానం 1
మొదటి రాశిలో శనీశ్వరుడు, మూడవ రాశిలో గురు రాహువులు, భాగ్య స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు, పని భారం పెరుగుతాయి.
ఉద్యోగ, వ్యాపారాల్లో శారీరక శ్రమ ఎక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. సొంత లాభం కొంత మానుకుని బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయపడతారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల కారణంగా కొద్దిగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా చెల్లుబాటు అవుతుందనే ధోరణి మంచిది కాదు. మీకు రహస్య శత్రువులు ఉన్నారనే విషయాన్ని గమనించండి. మీ దగ్గర నుంచి సహాయం పొందిన వారే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది.
శని ప్రభావం
ఏలినాటి శని ప్రభావం వల్ల శ్రమ తిప్పట ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు లాభిస్తాయి. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.
జూలై నుంచి మంచి కాలం
ఐ టి, ఇంజనీరింగ్ టెక్నాలజీ టెక్నికల్ రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు అంది వస్తాయి. ఏ ఉద్యోగం అయినప్పటికీ శారీరక శ్రమ అనివార్యం అవుతుంది. పిల్లలు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. సాధారణంగా జూలై నుంచి ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల ఉంటుంది. తీర్థ యాత్రలకు, దూర ప్రయాణాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది.
పరిహారాలు
శతభిషం పూర్వాభాద్ర నక్షత్రాల వారికి వృత్తి ఉద్యోగాలపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిం చాల్సిన అవసరం ఉంది. స్నేహం ముసుగులో అవాంఛనీయ శక్తులు చుట్టూ చేరే ప్రమాదం ఉంది.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..