Marriage Astrology: కన్యా రాశిలో కుజ, రవి కలయిక.. ఆ రాశుల వారికి వివాహ బంధాల్లో సమస్యలు..!

| Edited By: Janardhan Veluru

Sep 23, 2023 | 5:56 PM

ప్రస్తుతం కుజ, రవి గ్రహాలు కన్యా రాశిలో కలవడం వల్ల ప్రధానంగా ఏడు రాశులకు వివాహ బంధంలో సమస్యలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అవిః మేషం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభం, మీనం. ఈ రాశుల వారిలో ఈ కలయిక వల్ల తీవ్ర స్థాయిలో అహంకారం, ఆధిపత్య ధోరణి, అనవసర మొండితనం, ఒంటెద్దు పోకడలు పోవడం వంటివి వివాహ బంధంలో ప్రధాన సమస్యలుగా మారుతాయి.

Marriage Astrology: కన్యా రాశిలో కుజ, రవి కలయిక.. ఆ రాశుల వారికి వివాహ బంధాల్లో సమస్యలు..!
Marriage Astrology
Follow us on

ప్రస్తుతం కన్యా రాశిలో కుజ, రవులు కలిసి సంచారం చేస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడమనేది కొన్ని రాశులకు యోగం కలిగిస్తే మరి కొన్ని రాశులకు సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడమే కాదు, ఒక దానికొకటి కేంద్రాల్లో ఉన్నా, అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నా, వివాహ బంధాల్లో సమస్యలు తీసుకువస్తుందని జ్యోతిష నిపుణుల అభిప్రాయం. పాశ్చాత్య జ్యోతిష శాస్త్రం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కన్యా రాశిలో కలవడం వల్ల ప్రధానంగా ఏడు రాశులకు వివాహ బంధంలో సమస్యలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అవిః మేషం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభం, మీనం. ఈ రాశుల వారిలో ఈ కలయిక వల్ల తీవ్ర స్థాయిలో అహంకారం, ఆధిపత్య ధోరణి, అనవసర మొండితనం, ఒంటెద్దు పోకడలు పోవడం వంటివి వివాహ బంధంలో ప్రధాన సమస్యలుగా మారుతాయి. రవి గ్రహం అక్టోబర్ 17 వరకూ ఈ రాశిలో కొనసాగుతున్నందువల్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల అహంకారం పెరిగిపోతుంది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు, అభిరుచులకు విలువనివ్వడం తగ్గుతుంది. అవసరం ఉన్నా లేక పోయినా వాదోపవాదాలకు దిగడం కూడా ఉంటుంది. ఫలితంగా కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఓర్పు, సహనా లతో వ్యవహరించడం, కోపతాపాలను తగ్గించుకోవడం వంటివి అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో అంటే సుఖ స్థానంలో, ఈ రవి, కుజుల కలయిక జరుగుతున్నందు వల్ల కుటుంబంలో ప్రశాంతత తగ్గే సూచనలున్నాయి. దంపతుల మధ్య అపార్థాలు తలెత్తడం, బంధువులు కల్పించుకుని సమస్యను మరింత పెంచి పెద్ద చేయడం వంటివి జరుగుతాయి. అపార్థాలు, వాదనలు తలెత్తకుండా చూసుకోవడం మంచిది. దంపతుల మధ్య అనుమానాలు, సందేహాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎంత ఓర్పుగా వ్యవహరిస్తే కుటుంబానికి అంత మంచిది.
  3. సింహం: ఈ రాశికి కుటుంబ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల కుటుంబ సమస్యలు పరాకాష్టకు చేరుకుంటాయి. ఆర్థిక సమస్యలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు, అనారోగ్యాల కారణంగా దంపతుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడం, దానివల్ల కుటుంబ జీవితం అల్లకల్లోలం అవుతుండడం జరుగుతుంది. మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక్కోసారి దంపతులు ఒకరికొకరు దూరంగా ఉండడం, దూరంగా ఉద్యోగాలు చేసుకోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశిలోనే రవి, కుజుల కలయిక జరుగుతున్నందువల్ల ఈ రాశివారిలో దురహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ కోపంతో చిందులు తొక్కడం, అసహనంతో వ్యవహ రించడం, అపార్థాలు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆధిపత్య ధోరణి బాగా పెరిగి పోయి, ఇతరుల అభిప్రాయాలకు, అభిరుచులకు విలువనివ్వడం తగ్గిపోతుంది. కొద్ది కాలం పాటు ఎంత సహనంతో వ్యవహరిస్తే అంత మంచిది. లేని పక్షంలో సంసార జీవితం దెబ్బతినే అవకాశం ఉంది.
  5. తుల: ఈ రాశికి 12వ స్థానంలో, అంటే శయన స్థానంలో ఈ కలయిక చోటు చేసుకుంటున్నందువల్ల దాంపత్య జీవితంలో ఏదో ఒక కారణంగా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా, పర్యటనల కారణంగా ఎడబాటు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. బంధువుల జోక్యం అతిగా ఉండే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమ స్థానంలో ద్వేషం తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల కొద్ది రోజుల పాటు ఓర్పుగా వ్యవహరించడం మంచిది.
  6. కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో అంటే మాంగల్య స్థానంలో ఈ రవి, కుజుల కలయిక జరగడం వల్ల ఈ రాశివారు దాంపత్య జీవితానికి సంబంధించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ పడే పనేదీ చేయకపోవడం మంచిది. జీవిత భాగస్వామిని అనుమానించడం, సందేహించడం వంటి పనుల వల్ల దాంపత్య జీవితం సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల పాటు ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
  7. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ కలయిక చోటు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో తరచూ వాదాలకు దిగడం, ఘర్షణ పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలలో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. జీవిత భాగస్వామికి అనారోగ్యం కలగడం గానీ, ప్రమాదం సంభవించడం గానీ జరగవచ్చు. కొన్ని కీలక కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వీలైనంత కేరింగ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)