Telugu News Astrology Jupiter’s Aspect on Rahu in Aquarius Brings Wealth and Foreign Opportunities for These Zodiac Signs
Wealth Astrology: రాహువుతో వారికి సిరిసంపదలు ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
Jupiter’s Aspect on Rahu in Aquarius: కుంభ రాశిలో శతభిష నక్షత్రంలో సంచరిస్తున్న రాహువుపై గురువు నవమ దృష్టి పడుతోంది. ఈ ప్రభావంతో రాహువు యోగదాయకంగా మారి మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ధనలాభాలు, విదేశీ అవకాశాలు, వారసత్వ సంపద వంటి శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.
ప్రస్తుతం కుంభ రాశిలో సొంత నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్న రాహువును మరో మూడు నెలల పాటు గురువు నవమ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. అత్యంత పాప గ్రహమైన రాహువును దేవతల గురువైన గురువు వీక్షించడం వల్ల రాహువు యోగదాయకంగా మారడంతో పాటు తనకు ఇష్టమైన రాశులను సిరిసంపదల్లో ముంచెత్తుతాడు. రాహువు విదేశాలకు, ఆకస్మిక ధన లాభానికి, వారసత్వ సంపదకు కారకుడు. దీన్ని ధన కారకుడైన గురువు చూడడం వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ధన ధాన్య సమృద్ధి యోగం, విదేశీ సంపాదన యోగంతో పాటు అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు సొంత నక్షత్రమైన శతభిషంలో ఉండడంతో పాటు, ఆ గ్రహాన్ని భాగ్యాధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం తప్పకుండా కలిగే అవకాశం ఉంది. ఈ రాశి ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. పిత్రార్జితం అందుతుంది.
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాహువును ఈ రాశిలోని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక యోగాలు కలుగుతాయి. వీరు త్వరలో ఉన్నత పదవులకు, భారీ జీతభత్యాలకు అవకాశం ఉన్న సంస్థలోకి మారే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు క్రమంగా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా అనేక పర్యాయాలు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న రాహువును లాభ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మహా భాగ్య యోగం పడుతుంది. ముఖ్యంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు పూర్తిగా పరిష్కారమై అన్యోన్యత, సామరస్యం వృద్ది చెందుతాయి. సాంప్రదాయ విరుద్ధమైన పెళ్లి జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న రాహువును భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ధనుస్సు: ఈ రాశికి తృతీయంలో ఉన్న రాహువును రాశ్యధిపతి గురువు సప్తమ స్థానం నుంచి చూడడం వల్ల సామాన్య వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా పురోగతి చెందడం ప్రారంభం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అత్యధికంగా లాభాలనిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువును పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి సంపద వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులతో పాటు భారీ జీతభత్యాలు పొందడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి వృద్ధి చెందుతుంది. ప్రేమ వివాహం జరిగే సూచనలున్నాయి. సంతాన యోగం కలిగే అవకాశం బాగా ఉంది.