Money Astrology
ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురువును ప్రస్తుతం ఉచ్ఛ రాశిలో ఉన్న కుజుడు కూడా వీక్షించడం ప్రారంభం అయింది. చాలాకాలంగా గురువును శనీశ్వరుడు కూడా వీక్షించడం జరుగుతుంది. గురువు మీద కుజుడి దృష్టి మార్చి 15 వరకూ కొనసాగుతుంది. ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల అయిదు రాశుల వారికి గురువు నుంచి శుభ యోగాలు, శుభ ఫలితాలు అందుతాయి. అవిః మేషం, తుల, ధనుస్సు, మకరం, మీనం. ఈ రకమైన గ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా బలోపేతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనేక ఆర్థిక లాభాలు చేతికి అందివస్తాయి.
- మేషం: ఈ రాశిలో ఉన్న గురువు మీద ఉచ్ఛస్థితిలో ఉన్న రాశ్యధిపతి కుజుడి దృష్టి పడడం వల్ల జీవితంలో అనేక సానుకూల, శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి సంస్థలో అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది. ఒక ప్రముఖుడిగా మారే అవకాశం కూడా ఉంది.
- తుల: ఈ రాశివారికి చతుర్థంలో ఉచ్ఛలో ఉన్న కుజుడు, పంచమంలో స్వక్షేత్రంలో ఉన్న శనీశ్వరుడు సప్తమ రాశిలో ఉన్న గురువును చూడడం వల్ల అనేక శుభ ఫలితాలకు, శుభ యోగాలకు అవ కాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరిగి, ఆర్థికంగా ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. అంచనాలకు మించి భోగభాగ్యాలు అనుభవించడం జరుగు తుంది.
- ధనుస్సు: ఈ రాశ్యధిపతి అయిన గురువు మీద శని, కుజుల దృష్టి పడినందువల్ల ఆస్తి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తిపాస్తులు సమకూరడంతో పాటు, ఆస్తుల విలువ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం, రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి. ఇంట్లో ఆధునిక సౌకర్యాలను అమర్చుకుంటారు. ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి. అనేక విధాలుగా శుభవార్తలు వినడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశిలో, అందులోనూ తన ఉచ్ఛ రాశిలో, సంచారం ప్రారంభించిన కుజుడి దృష్టి చతుర్థ స్థానంలో ఉన్న గురువు మీద పడినందువల్ల, అర్ధాష్టమ గురువు ప్రభావం తగ్గి, శుభ ఫలితాలు అందడం ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. స్థిరాస్తులు సమ కూర్చుకుంటారు. నిరుద్యోగులు ఊహించని విధంగా చక్కని ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశ్యధిపతి అయిన గురువును ఉచ్ఛ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశివారి ప్రాభవం తప్పకుండా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా వీరికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అనేక విధాలుగా సంపాదించడం జరుగుతుంది. మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది.