YSRCP vs TDP Flexi controversy: పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పల్నాడు (Palnadu Politics) లో సరికొత్త వివాదం రాజుకుంది. ఫ్లెక్సీల ఏర్పాటుపై వైఎస్ఆర్‌సీపీ (YSRCP), టీడీపీ నేతలు బాహాబాహీలకు దిగుతున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుండటంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. మాచర్లలో ప్రారంభమైన ఫ్లెక్సీల వివాదం నర్సరావుపేట నియోజకవర్గానికి పాకింది. మాచర్ల ఇంఛార్జ్ గా బ్రహ్మరెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ (TDP) అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించి వేశారు. వైసీపీ కార్యకర్తలే చించి వేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది.
ఆ తర్వాత నర్సరావుపేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీలు ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కేశానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను తగల బెట్టారు. దీంతో సచివాలయం అధికారులు ఫ్లెక్సీలు తొలగించాలని అదేశాలు జారీ చేశారు. అయితే టీడీపీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాలనడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వెల్థుర్థి మండలం గుండ్లపాడులో 13 తేదిన టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య జరిగింది. ఆయన దశ దిన కర్మల సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలు చించడంతో గ్రామంలో మరోసారి వివాదం రాజుకుంది. రెండు వర్గాలు ఘర్షణకు దిగటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలా పల్నాడులో పలు చోట్ల ప్లెక్స్ ల ఏర్పాటు రెండు పార్టీల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుండటంతో పోలీసులు ఇరు పార్టీలకు పలు సూచనలు చేస్తున్నారు. వివాదం తలెత్తే అవకాశం ఉన్న చోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పలు చోట్ల నాయకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
టి. నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు
Also Read: