AP Politics: పవన్‌ చేపట్టిన యాత్రకు వైసీపీ విరుగుడు మంత్రం అదేనా

Pawan Kalyan: కాపుల చుట్టు ఏపీ రాజకీయం న‌డుస్తోంది. కాపు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌గా ముద్రగడ పద్మనాభం విరుచుకుప‌డుతున్నారు. వైసీపీలో చేరాలని ముద్రగడకు ఇప్ప‌టికే ఆహ్వానం అందింది.

AP Politics: పవన్‌ చేపట్టిన యాత్రకు వైసీపీ విరుగుడు మంత్రం అదేనా
Pawan Kalyan - CM Jagan

Updated on: Jun 20, 2023 | 2:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి, అదే సమయంలో పొలిటికల్‌ కాక కూడా తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని అధికార పార్టీ అంటున్నా రాజకీయాలు మాత్రం హాట్‌ హాట్‌గా మారిపోతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయయాత్ర చేపట్టిన తర్వాత రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేయడం రాజకీయాల్లో సహజమే అయినా ఏపీలో ప్రధాన పార్టీలు వాటికి ఇంకాస్త పదుసు పెడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కాపులే కీలకం కావడంతో వారికి దగ్గరయ్యేందుకు ఏపీలో అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. కాపుల మద్దతు కోసం పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, అటు ముద్రగడ ద్వారా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

పవన్‌ చేపట్టిన యాత్రకు విరుగుడు మంత్రంగా అధికార YCP – కాపు నేత ముద్రగడను ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ చేపట్టిన వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలన్నీ కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్నవే. ఈ క్రమంలో పవన్‌ యాత్ర ప్రభావాన్ని తగ్గించేందుకు అధికార YCP ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. పవన్‌ యాత్ర చేపట్టిన వెంటనే ముద్రగడ పద్మనాభం తెరపైకి రావడంతో ఆ వ్యూహంలో భాగమేనని కొందరు అంటున్నారు. ముద్రగడతో వైసీపీ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశం కావడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ సెగలకు వేదికగా నిలిచే కిర్లంపూడికి వచ్చిన YCP నేతలు చాలాసేపు ముద్రగడతో మంతనాలు సాగించారు. YCPలోకి చేరాలని ముద్రగడను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే కాకినాడ లోక్‌సభ స్థానాన్ని పద్మనాభానికి, పిఠాపురం అసెంబ్లీ టికెట్‌ ఆయన కుమారుడికి ఆఫర్‌ చేసినట్టు టాక్‌.

జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత కాపు ఉద్యమం, రిజర్వేషన్లపై గతంలో ప్రశ్నించిన రీతిలో మాట్లాడటం లేదనే అభిప్రాయం ఉంది. జగన్‌కు ముద్రగడ మద్దతుగా నిలుస్తున్నారనే వాదనా లేకపోలేరు. ఇదే మాటను ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ కూడా పరోక్షంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం