YSRCP: నేడు సీఎం జగన్‌ను కలిసిన నేతలు వీరే.. త్వరలో ఐదో లిస్ట్

|

Jan 22, 2024 | 7:11 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జుల మార్పు కొనసాగుతూనే ఉంది. నాలుగు లిస్టులు అయిపోయాయ్‌... ఇక ఐదో లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు క్యూ కడుతున్న నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా అప్ డేట్స్ మీకోసం...

YSRCP: నేడు సీఎం జగన్‌ను కలిసిన నేతలు వీరే.. త్వరలో ఐదో లిస్ట్
YSRCP Candidates
Follow us on

వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పులుచేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ఇప్పటి వరకు నాలుగు దశల్లో నాలుగు జాబితాలు విడుదల చేయగా… మొదటి జాబితాలో 11 అసెంబ్లీ సెగ్మెంట్స్.. రెండో జాబితాలో 3 పార్లమెంట్, 24 అసెంబ్లీ సెగ్మెంట్స్… మూడో జాబితాలో 6 పార్లమెంట్, 15 అసెంబ్లీ సెగ్మెంట్స్… నాలుగో జాబితాలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ సెగ్మెంట్స్‌… ఇలా మొత్తంగా ఇప్పటి వరకూ 10 పార్లమెంట్, 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసింది.

ఇప్పుడు, 5వ జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన సెగ్మెంట్స్ పై దృష్టి సారించింది. మార్పులు జరగాల్సి ఉన్నచోట… కొత్తగా అవకాశం దక్కేవారినీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనూ పిలిచి మాట్లాడుతోంది. ఎన్నికల్లో కలిసి పని చేయాలని తాజా, మాజీ నేతలకు సూచిస్తోంది. ప్రస్తుత ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేస్తోంది వైసీపీ అధిష్ఠానం.

ఇప్పటి వరకు చాలా స్థానాల్లో అభ్యర్థుల మార్పులు జరిగినా.. అది కూడా ఫైనల్‌ కాకపోవచ్చని చెబుతోంది వైసీపీ అధిష్ఠానం. అభ్యర్థుల పనితీరు సరిగా లేక పోయినా,ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేకపోయినా మళ్లీ మార్పులు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ప్రకటించబోయే ఐదో జాబితానే.. ఫైనల్‌ అనే సంకేతాల్ని అటు ప్రజల్లోకి ఇటు పార్టీ శ్రేణుల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పలువురు నేతలకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్సి ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ .. సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం కీలకంగా మారింది. అదే స్థానానికి ఇటీవల బుచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని ఇంచార్జిగా నియమించిన వైసీపీ హైకమాండ్‌.. వేణుగోపాల్‌కు ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పింది. అయితే దీనిపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసూపల్లి గణేష్ కూడా.. సీఎం ఆఫీసుకు వచ్చారు. ఈసారి టికెట్ ఇవ్వలేమని గణేష్‌కు చెప్పేందుకే పార్టీ పెద్దలు పిలిచినట్టు తెలుస్తోంది. కుప్పం నేత ఎమ్మెల్సీ భరత్, ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేక వేంకట ప్రతాప అప్పారావు, మంత్రి పినేపి విశ్వరూప్.. సీఎంను కలిసినవారిలో ఉన్నారు. మంత్రి నారాయణ స్వామి కూడా ఆయన కుమార్తెతో కలిసి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈసారి తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని ఇటీవల వైసీపీ అధిష్టానం ఎదుట నారాయణస్వామి ప్రతిపాదన పెట్టారు.

గురజాల ఎమ్మేల్యే కాసు మహేష్ రెడ్డి సైతం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. గురజాల స్థానాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల ఆశిస్తుండటంతో… చర్చలు జరిపేందుకే కాసు మహేష్ రెడ్డిని పిలిపించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 5వ జాబితాపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేయడంతో… నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..