స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసులోనే అరెస్ట్ అయ్యారు. త్వరలో నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబుతోపాటు నారాలోకేష్ టార్గెట్‌గా వైసీపీ మంత్రులు, నేతలు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అవినీతికి పాల్పడడం వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని.. త్వరలో మరికొంత మంది అరెస్ట్ అవుతారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరో మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణపై సంచలన కామెంట్స్ చేశారు. చాలామంది ఉన్నారని.. త్వరలో భయంకరమైన నిజాలు బయటికి రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. అమరావతిలో 800 కోట్ల విలువైన భూములు కొట్టేశారని ఆరోపించారు. జైలులో చంద్రబాబును కలిసింది ఎందుకో అందరికీ తెలుసంటూ అనిల్ వ్యాఖ్యానించారు. అనిల్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇదిలావుంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ముమ్మాటికీ అవినీతి జరిగిందని.. ఆధారాలున్నాయంటూ మంత్రి కాకాని గోవర్థన్ పేర్కొన్నారు. అక్రమంగా అవినీతి చేయడం వల్లే సక్రమంగా చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్నారు. అటు.. ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన నారా లోకేష్.. ఢిల్లీలో దాక్కుకున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మెయింటేన్ చేసి తండ్రిని బయటకు తీసుకొచ్చేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కాకాని ఆరోపించారు.
మొత్తంగా.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ కాగా.. త్వరలో లోకేష్ సైతం జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరగుతుందో..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే.. చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా సత్యమేవ జయతే పేరుతో ఇవాళ టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. గాంధీ జయంతి నేపథ్యంలో జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి దీక్షలు చేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని టీడీపీ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..