YS Jagan: శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు.. జగన్ ఊహించని కామెంట్స్

వైసీపీని నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నారన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. కొన్ని వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయిని.. గత ఎన్నికలతో పోల్చితే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని గుర్తు చేశారు.

YS Jagan: శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు.. జగన్ ఊహించని కామెంట్స్
Jagan Mohan Reddy

Updated on: Jun 14, 2024 | 7:01 PM

వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందని జగన్ కామెంట్ చేశారు. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోందన్నారు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలన్నారు. వైసీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్. కొన్ని లక్షలమంది కార్యకర్తలు పార్టీపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారని.. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి 40శాతం ఓట్లు వచ్చాయని.. గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని లెక్కలను వివరించే ప్రయత్నం చేశారు జగన్.

ప్రతి ఇంట్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ఉందన్నారు జగన్. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని.. పోరాటపటిమ తగ్గకూడదని నేతలకు సూచించారు. తన వయసు తక్కువే అని.. ఇంకా తనలో సత్తువ తగ్గలేదని అన్నారు. అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి తనకు ఉందన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకువస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని.. మొత్తంగా 15 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారని జగన్ నేతలతో అన్నారు. పార్లమెంట్‌లో వైసీపీ కూడా బలమైనదే అని చెప్పారు. ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాలని సూచించారు. రాబోయే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని.. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాహితమే ధ్యేయం కావాలని ఎంపీలకు సూచించారు. అంశాలవారీగా ఎవరికైనా మద్దతు ఉంటుందని.. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని జగన్ దిశానిర్దేశం చేశారు.

రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని సీఎం జగన్ ఎంపీలకు తెలిపారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్. గత పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేయాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…