
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్ వీధికి చెందిన మైనర్ బాలికపై.. ఆమె పెద్దమ్మ కొడుకైన చిరంజీవి అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సదరు బాలిక తల్లి పనికి వెళ్లిన సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు చిరంజీవి. దీంతో మైనర్ బాలిక గర్భవతి అయింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను.. తల్లి ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ కాసేపటికే మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆ శిశువు మరణించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక నుంచి వాంగ్మూలం నమోదు చేసి.. నిందితుడిని చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.