
నిశ్చితార్థం, పెళ్లి విషయంలో అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోకుండా పెద్దలు బలవంతం చేస్తే యువకులు బలవుతున్న ఘటనలు శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, పెనుకొండ జిల్లాల్లో వెలుగు చూశాయి. పెళ్లి చేసుకోబోయే యువతి కనిపించకుండా పోవడంతో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా, మేనమామ కూతురు మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రానికి చెందిన రామాంజి అనే యువకుడికి మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే నిశ్చితార్థం జరగాల్సిన ఆ అమ్మాయి.. నచ్చిన యువకుడితో వెళ్ళిపోయింది. దీంతో గ్రామంలో పరువు పోయిందని, తీవ్ర మనస్తాపానికి గురైన రామాంజి.. బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న రామాంజిని గమనించిన స్థానికులు వెంటనే మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొంతు దగ్గర గాయం తీవ్రంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అతడిని హుటాహుటిన బెంగళూరుకు తరలించారు. కాబోయే భాగస్వామి అదృశ్యం అవ్వడంతోనే రామాంజి మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇలాంటి మరో విషాద ఘటన పెనుకొండలో చోటు చేసుకుంది. మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఓ యువకుడు, ఆమె వేరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమందేపల్లి మండలం రంగేపల్లికి చెందిన సూర్య ప్రకాష్ అనే యువకుడు తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తాను ప్రేమించిన అమ్మాయినే కూడా వద్దనుకున్నాడని తెలుస్తోంది. అయితే పెళ్లి ఇష్టం లేని మేనమామ కూతురు.. సూర్య ప్రకాష్‌ను కాదని వేరొక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సూర్య ప్రకాష్.. సూసైడ్ లెటర్ రాసి పెట్టి, చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ రెండు ఘటనలు కూడా.. పెళ్లి విషయంలో అమ్మాయిల ఇష్టాఇష్టాలను తెలుసుకోకుండా తల్లిదండ్రులు తీసుకునే బలవంతపు నిర్ణయాలు యువకుల జీవితాలను ఎలా బలితీసుకుంటున్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరి ఇష్టంతో జరిగే వివాహమే సుఖవంతమవుతుందని, పిల్లల మనసును అర్థం చేసుకోవాలని ఈ సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.