
ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. తాజాగా వైసీపీ మూడో జాబితాను ప్రకటించింది. అందులో మొత్తం 21 స్థానాలకుగాను ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 స్థానాలు రాయలసీమలోనే ఉన్నాయి. 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. సామాజిక సమీకరణలు, సర్వేలు ఆధారంగా వైసీపీ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఎంపీగా మార్చి సీట్లు సర్దుబాటు చేసింది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంకు సర్వేల్లో బాగాలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన కారణంగా వైసీపీ హై కమాండ్ ఎంపి అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చింది. అలాగే పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం ఎస్ బాబును మార్చి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది.
2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్‌కు టికెట్ నిరాకరించి ఎమ్మెస్ బాబుకు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు తిరిగి అదే ఫార్ములా ప్రయోగించింది. మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషను తప్పించి నిసార్ అహ్మద్‌కు చోటు కల్పించింది. పంచాయతీ రాజ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన నిసార్ అహ్మద్ కు మదనపల్లిలో మైనారిటీ వర్గాల్లో మంచి పేరు ఉంది. వైయస్ ఫ్యామిలీతో పాటు పెద్దిరెడ్డి ఆశీస్సులు కూడా నిస్సార్ అహమ్మద్ కు కలిసొచ్చింది. దీంతో వైసీపీ మదనపల్లి సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం. ఇక అన్నమయ్య జిల్లాలోని రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి చెక్ పెట్టిన వైసీపీ అధిష్టానం కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించింది. 2019 ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేడా టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో అప్పట్లో టికెట్ ఇచ్చిన వైసీపీ ఈసారి ఆకేపాటికి అవకాశం కల్పించింది.
అనంతపురం జిల్లా రాయదుర్గం సిటీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించిన వైసీపీ మెట్టు గోవిందరెడ్డిని సమన్వయకర్తగా నియమించింది. కర్నూలు జిల్లాలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా బరిలో దింపనుంది వైసీపీ. జయరాం స్థానంలో ఆలూరు సమన్వయకర్తగా చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షికి అవకాశం కల్పించింది. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంను ఎంపీగా, విరుపాక్షిని ఆలూరు అసెంబ్లీకి పంపాలని వైసీపీ నిర్ణయించింది. అలాగే కోడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి డాక్టర్ సతీష్‌కు అవకాశం కల్పించింది. చిత్తూరు సిటీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును తప్పించి ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా ఉన్న విజయానంద రెడ్డికి అవకాశం కల్పించింది. ఈ జాబితాలో కీలక మార్పులు చేర్పులు చేసిన అధిష్టానం రానున్న రోజుల్లో మరెన్ని మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..