ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలతో జనం బాట పట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంక్షేమ పథకాల అమలు, నగదు బదిలీ ద్వారా పేద వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన విధానం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రలు చేపట్టింది. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పేద, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం, పదవుల కేటాయింపు ద్వారా సామాజిక సాధికారతలో వైసీపీ ప్రభుత్వం రికార్డు సాధించిందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
అక్టోబర్ 26వ తేదీ నుంచి సామాజిక సాధికార యాత్రలు ప్రారంభం అయ్యాయి. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లోని మూడు నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్రలు జరుగుతున్నాయి. ముందుగా యాత్ర జరిగే నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అందించిన, ఆ నియోజకవర్గానికి అందించిన సంక్షేమ పథకాల వివరాలు, పదవుల కేటాయింపులపై ప్రజలకు వివరిస్తున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రంలో బస్సు యాత్ర ద్వారా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
ఈ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు పాల్గొంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయా వర్గాలకు ఎంతమేర పథకాలు అందాయి, వైసీపీ వచ్చిన తర్వాత జరిగిన లబ్ధిని బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరిగే సభలకు ఆయా సామాజికవర్గాలకు చెందిన మంత్రులు హాజరవుతున్నారు. ఇప్పటికే రెండువిడతల్లో యాత్రలు ముగిశాయి. ఈ నెల 4 నుంచి మూడో విడత యాత్రలకు వైసీపీ సిద్ధమైంది.
వైసీపీ సామాజిక సాధికార యాత్రలు అక్టోబర్ 26 వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. నవంబర్ 15 నుంచి 29 వరకూ రెండో విడత బస్సు యాత్రలు ముగిశాయి. మొదటి విడతలో 35 నియోజకవర్గాల్లో రెండో విడతలో 33 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్రలు జరిగాయి. బస్సు యాత్రలకు పేదలు ఎక్కువగా హాజరయ్యేలా చూడాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచించారు. ప్రస్తుతం పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అయితే పార్టీ నేతలు ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో భారీగా ప్రజలు ఈ సభలకు హాజరవుతూ ఉండటం తో వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
ఇప్పటివరకూ నగదు బదిలీ పధకాల ద్వారా 2 లక్షల 40 వేల కోట్లు పేదలకు అందించడం ద్వారా ఆర్థికంగా ఆయా కుటుంబాలకు అండగా నిలబడ్డామనే అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా రికార్డు స్థాయి పదవులు ఇచ్చిన అంశాన్ని బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలా విజయవంతంగా 68 నియోజకవర్గాల్లో రెండు విడతల్లో సామాజిక సాధికార యాత్రలు ముగిశాయి. ఈ నెల 4 నుంచి మూడో విడత యాత్రలకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ మొత్తం 33 నియోజకవర్గాల్లో మూడో విడత సామాజిక సాధికార యాత్రలు జరగనున్నాయి. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే సభలను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు
డిసెంబర్ 4 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ మొత్తం 33 చోట్ల జరగనున్న యాత్రలు. డిసెంబర్ 4వ తేదీన రాప్తాడులో, డిసెంబర్ 5న చోడవరం,నందిగామ,రాయదుర్గంలో, డిసెంబర్ 7న అరకు, గుంటూరు వెస్ట్, మడకశిరలో, డిసెంబర్ 9న టెక్కలి, నిడదవోలు, గుంతకల్లులో, డిసెంబర్ 11న నర్సీపట్నం, ఉండి, కమలాపురంలో, డిసెంబర్ 12 పాతపట్నం, మైలవరం, కుప్పంలో, డిసెంబర్ 13న విజయనగరం, కోడూరులో.. డిసెంబర్ 14న శ్రీకాకుళం, అనపర్తి, పలమనేరులో.. డిసెంబర్ 22వ తేదీన పాయకరావుపేట, మండపేట, ఆదోనిలో, డిసెంబర్ 23వ తేదీన విశాఖపట్నం నార్త్, తాడికొండ, పాణ్యంలో డిసెంబర్ 27వ తేదీన ఉంగుటూరు, పుట్టపర్తిలో.. డిసెంబర్ 28వ తేదీన పెనమలూరు, రాయచోటిలో, డిసెంబర్ 29న కాకినాడ సిటీ, అనంతపురంలో బస్సు యాత్ర జరగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..