
ఏపీలో వైసీపీ ఓటమి తరువాత పార్టీలో నెలకొన్న పరిణామాలను చక్కబెడుతున్న జగన్ మోహన్ రెడ్డి.. సమయం దొరికినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నారు. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కూడా భేటీఅవుతున్నారు. ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఓటమి తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గాల ఇంచార్జీలను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి పునర్వైభవం వచ్చేలా వార్డు , గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాల వారిగా నూతన నియామకాలు చేపట్టారు. ఇక వాటితో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు సైతం అధ్యక్షులను నియమించి ఆయా విభాగాల కమిటీలతో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు నాయకులతో భేటీలు సమావేశాలు నిర్వహించిన జగన్ .. ఇప్పుడు పూర్తి సమయం ప్రజలకు, కార్యకర్తలకు ఇస్తున్నారు. ముఖ్యంగా జగన్ తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రజలతో కలిసి వారితో ప్రత్యేకంగా చర్చిస్తూ వారి విజ్ఞప్తులను, అభిప్రాయాలను, సలహాలను, సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామనే హామీలు ఇచ్చేస్తున్నారు.
గత కొంత కాలంగా కార్యకర్తలతో జగన్ మోహన్ రెడ్డి సమావేశం కావడం లేదని కార్యకర్తలతో కలిసే అవకాశం ఇవ్వడం లేదననే విమర్శలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వ బాధితులు ఎవరైనా ఉంటే వారిని పరమర్శించడంతో పాటు వారికి అవసరం అయితే పార్టీ పరంగా అండగా ఉంటాం అనే భరోసా ఇస్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ఇలా ప్రజలతో కలిసిపోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..