Yaas Cyclone: ఓవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు యాస్ పేరుతో తుపాను ముంచుకొస్తోంది. రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్లెల్లా హెచ్చరించారు. యాస్ తుపాను పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. పెను తుపానుగా మారి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య రేపు తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విశాఖకు వెళ్లాలని ఆదేశించారు. తుపానుతో కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని, తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని తరలించాలని ఆదేశించారు.
ఇక తుపాను సన్నద్ధతపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని సీఎం జగన్ అమిత్‌షాకు తెలిపారు.
Little Boy: కటింగ్ చేయించుకుంటూ బుడ్డోడి ఏబీసీడీ పాట చూస్తే ఎవరైనా మెస్మరైజ్ కావలసిందే! Viral Video
Bangalore: కరోనా పేషెంట్స్ లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో వైద్యసిబ్బంది డ్యాన్స్..Viral Video