ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది. అంబటిని చుట్టుముట్టి సమస్యలపై నిలదీయడంతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. గ్రామస్తుల సమస్యలను వింటూ వీధివీధి తిరిగారు. అయితే ఎస్సీ కాలనీలోకి రాగానే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) నిరసన సెగ తగిలింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన మహిళలు, సమస్యలపై మంత్రిని నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీలపై ప్రశ్నించారు. ఏవేవో పథకాలు ఇస్తున్నట్లు చెబుతున్నారని, కానీ తమకు ఏ సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు కూడా రావడం లేదని, పింఛను కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లయినా రాలేదంటూ ఓ దివ్యాంగురాలు మంత్రిని నిలదీసింది. మహిళలు, అరుపులు కేకలతో విరుచుపడటంతో అంబటి రాంబాబు షాక్‌కు గురయ్యారు.
ప్రశ్నించిన మహిళలపై మంత్రి అంబటి అసహనం వ్యక్తంచేస్తూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ్నుంచి మరో వీధికి వెళ్లిపోయారు. కాగా.. రాజుపాలెంలో పర్యటిస్తున్న మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ సానుభూతిపరులకు రోడ్ల వేయలేమని తేల్చి చెప్పారు. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హయాంలో వేసిన సిమెంట్ రోడ్డే గానీ.. వైసీపీ మూడేళ్ల పాలనలో ఏమీ చేయలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ చేసిన కామెంట్లపై రాజకీయ దుమారం నెలకొంది. నెల్లూరులో (Nellore) జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనూ తీసేస్తామని చెప్పడం గమనార్హం. మళ్లీ కొత్త వాళ్లను నియమించుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..