అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని కల్వకొలను వీధిలోని కనకదుర్గమ్మ వేపచెట్టు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలను తరతరాలుగా నిర్వహిస్తున్నారు. ఆడపడుచుల సంబరంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతుల నడుమ అలంకారభూషితమైన కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చారు. కల్వకొలను వీధిలోని వేపచెట్టు వద్ద కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు మహిళలు.
గురువారం సాయంత్రం 6 గంటలలకు ప్రారంభమైన సంబరం రాత్రంతా విజయవంతంగా సాగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణాసంచాల నడుమ వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారులు. అమ్మవారికి ప్రత్యేకంగా చేపట్టే మొక్కుల్లో మహిళలంతా గండదీపాలు తలపై పెట్టుకొని ఊరేగింపుగా ఆయా వీధులలో తిరిగారు. వేపచెట్టు వద్ద గండదీపాలు సమర్పించారు. అమ్మవారు గాజుల గౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మహెూత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని, అమ్మవారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..