వైసీపీ ఇన్‌ఛార్జి మార్పు అనంతరం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్కే సైలెంట్ అయిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. వైసీపీకి ఎంత సేవ చేశానో తనకు తెలుసన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని.. ఇక నుంచి వైఎస్ షర్మిల వెంట నడుస్తానంటూ ఆర్కే స్పష్టంచేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని.. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానంటూ స్పష్టంచేశారు. తాను షర్మిలను కలిశానని.. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు తన నిర్ణయం ఉంటుందన్నారు.
వైసీపీకి సిద్దాంతాలు ఉండాలి.. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానంటూ ఆర్కే పేర్కొన్నారు.
మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదంటూ ఆర్కే పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా.. తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానన్నారు. స్వయంగా తానే రూ.8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానంటూ పేర్కొన్నారు. తన సొంత డబ్బుతో mtmc, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసామన్నారు. లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని.. ఆర్కే వివరించారు.
తనకు ధనుంజయ రెడ్డి నిధులు మంజూరు చేస్తానని చాలా సార్లు మేస్సెజ్ పెట్టారన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమని.. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానంటూ ఆర్కే స్పష్టంచేశారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనంటూ ఈ సందర్భంగా వివరించారు.
తాను వైసీపీకి రాజీనామా చేశానని.. వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటూ ఆర్కే పేర్కొన్నారు. సీఎం జగన్ కు పులివెందుల అభివృద్ధి ఎలా అవసరమో మంగళగిరి, గాజువాక, భీమవరం కూడా అలాగే అవసరమన్నారు. తాను షర్మిలతో నడుస్తానని.. రాజీనామాకు కట్టుబడి ఉన్నానంటూ పేర్కొన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు.. తనకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే రాజీనామా చేశానంటూ ఆర్కే టీవీ9తో పేర్కొన్నారు. తన నియోజవర్గం పరిధిలో అభివృద్ధి జరగకపోతే తాను.. పార్టీలో ఉన్నా లేకున్నా.. ప్రయోజనం లేదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..