Chiranjeevi: విశాఖవాసిని అవుతానన్న చిరు.. 3 రాజధానులకు మద్దతా? వచ్చే ఎన్నికల్లో పోటీనా?

హైదరాబాద్‌ వాసి, విశాఖ నివాసిని అవుతానంటున్నారు. వైజాగ్‌పై మెగాభిమానం కురిపించారు. ఇది 3 రాజధానులకు మద్దతా? వచ్చే ఎన్నికలకు ప్రిపరేషనా? సాయంకాలం సాగరతీరం వాల్తేరు వీరయ్య భావోద్వేగానికి లోనై మనసులో మాట చెప్పేశారా! అసలు విషయం ఇంకేదైనా ఉందా?

Chiranjeevi: విశాఖవాసిని అవుతానన్న చిరు.. 3 రాజధానులకు మద్దతా? వచ్చే ఎన్నికల్లో పోటీనా?
Megastar Chiranjeevi

Updated on: Jan 09, 2023 | 7:55 PM

విశాఖతో మెగాస్టార్‌ చిరంజీవికి ఎంతో అనుబంధం ఉంది. సినీ బాక్సాఫీస్‌ లెక్కల్లో నైజాంలో నిజాం లాంటి చిరంజీవికి వాల్తేరు కూడా గట్టి అడ్డానే. మెగా హీరోలందరికి విశాఖలో మంచి క్రేజ్‌ ఉందని సినీ పండిట్స్‌ చెబుతుంటారు. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌లో మెగా స్టార్‌ చిరంజీవి విశాఖ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. విశాఖ అంటే ఆయనకు ఎంతో ఇష్టమో, అక్కడి ప్రజలంటే ఎంత ప్రేమో ఆయన మాటల్లోనే తెలిసిపోయింది. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉండాలనుకుంటున్నా అంటూ మనసులో మాట చెప్పేశారు చిరంజీవి.

హైదరాబాద్‌ వాసికి సడెన్‌గా విశాఖ మీద ఎందుకు గాలి మళ్లింది. సాయంకాలం సాగర తీరంలో భావోద్వేగపు కలవరింత పలవరింత దేనికి సంకేతం? చిరంజీవి విశాఖవాసి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? తన మనసులో మాటను ఆయన పరోక్షంగా చెబుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల గొడవ గట్టిగా నడుస్తోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ కావాలంటూ ఆ మధ్య ఉత్తరాంధ్ర ఉరిమింది. వైసీపీ మద్దతు ఇచ్చిన జేఏసీ భారీగా బహిరంగ సభ నిర్వహించి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కావాలంటూ కార్యాచరణ ప్రకటించి కాక రేపింది. తాజాగా ప్రజా సంఘాలు, విపక్షాల మద్దతుతో కొద్ది రోజుల క్రితమే వైజాగ్‌ వేదికగా మరో సభ జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలే తప్ప రాజధాని త్రికేంద్రీకరణ కాదంటూ వాళ్లు వాదన వినిపించారు. దీంతో ఇప్పుడు విశాఖ తీరంగా పొలిటికల్‌ తుఫాన్‌ చెలరేగుతోంది. రాజధాని అంశంతోనే బరిలోకి దిగి పొలిటికల్‌ పుంజులు తలపడుతుండడంతో వాల్తేరులో రాజకీయం రంజుగా బహు పసందుగా మారింది.

ఈ నేపథ్యంలో విశాఖవాసిని అవుతాను అని వాల్తేరు వీరయ్య తన మనసులో మాటను చెప్పెయ్యడంతో ఏపీలో మరోసారి పొలిటికల్‌ బీపీ పెరిగింది. చిరంజీవి మాటల వెనక మర్మం ఏంటి? ఆయన మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారా? విశాఖ అంటే నాకెంతో ఇష్టం అని చెప్పడం వెనక అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? వాల్తేరు వీరయ్య మాటలకు అర్థాలే వేరా అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందంటున్నారు. మరోవైపు గాడ్‌ ఫాదర్ సినిమాలో డైలాగును గుర్తు చేస్తున్నారు మరికొందరు. రాజకీయాలకు నేను దూరమయ్యాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ అప్పట్లో ఏపీలో పెద్ద రాజకీయ చర్చకు రచ్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య మళ్లీ పాలిటిక్స్‌ మీద మనసు పారేసుకున్నారా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి విశాఖ సీటు మీద కర్చీఫు వేశారా? అనే రాజకీయ చర్చ కూడా జరుగుతోందిట.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో భాగమా?

అయితే విశాఖలో స్టూడియో కట్టాలనే కోరిక చిరంజీవికి ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖవాసిని అవుతాను అని చెప్పి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. అసలివన్నీ కాదు…వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో చిరంజీవి ఎమోషన్ అయి తన మనసులో మాటను చెప్పి ఉంటారని సినీ పండిట్స్‌ విశ్లేషిస్తున్నారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయ జీవితంలో లేరు. రాజకీయాలకు రాంరాం చెప్పేసి చాలా కాలం అయింది. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేశాక మళ్లీ దానిలో వేలెందుకు పెడతారు? ఆయన సినీ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌కు కూడా ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు.

ఏ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలు చేసినా, ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు, విశాఖ వేదికగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అక్కడి రాజకీయ వర్గాల్లో ఈ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయని చెప్పక తప్పదు. వాల్తేరు వీరయ్య స్వయంగా క్లారిఫికేషన్ ఇచ్చేదాకా ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని, చర్చను రేపుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం