
‘‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.. వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’’ అన్నది ఆర్యోక్తి . ఈ సృష్టిలో తిరుమలకు మించిన పుణ్యక్షేత్రం, శ్రీ వేంకటేశ్వరుడిని మించిన దైవం మరొకటి లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమల తర్వాత అదే స్థాయిలో భక్తుల నీరాజనాలు అందుకుంటున్న దివ్యక్షేత్రం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. పెద్ద తిరుపతి తరహాలోనే ఇక్కడా నిత్య కల్యాణాలు, విశేష పూజలు వైభవంగా సాగుతాయి. అయితే సాధారణంగా అభిషేక ప్రియుడిగా కొలిచే వేంకటేశ్వరుడికి ఇక్కడ మాత్రం అభిషేకాలు జరగకపోవడం వెనుక ఒక అద్భుతమైన స్థలపురాణం దాగి ఉంది.
పురాణ గాథల ప్రకారం.. పూర్వం ద్వారకుడు అనే మహర్షి శ్రీవారి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు ఆచరించాడు . ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఒక వల్మీకం (చీమల పుట్ట) నుంచి స్వయంభువుగా ఆవిర్భవించారు. ఆ సమయంలో మహర్షి స్వామివారి పాదసేవ చేసుకునే భాగ్యాన్ని కోరగా, పరమాత్ముడు తన బొడ్డు పైభాగం వరకు మాత్రమే పుట్ట నుంచి దర్శనమిచ్చి, పాదాలు భూగర్భంలోనే ఉండిపోయేలా స్వయంభూగా వెలిశారు. ఆ తర్వాతి కాలంలో క్షేత్రాన్ని దర్శించిన భక్తులు, మహర్షులకు స్వామివారి పాదపూజ చేయలేకపోతున్నామన్న వెలితి మిగిలింది. శాస్త్రోక్తంగా పాదపూజ లేనిదే పూజాఫలం సంపూర్ణం కాదన్న భావనతో రామానుజాచార్యుల సంప్రదాయాన్ని అనుసరించే పండితులు స్వయంభూ విగ్రహం వెనుకభాగంలో మరో నిలువెత్తు ప్రతిష్ఠా మూర్తిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అందుకే ద్వారకా తిరుమల గర్భగుడిలో ఒకే విమాన శిఖరం కింద రెండు వేంకటేశ్వరస్వామి విగ్రహాలు కొలువై ఉండటం ఇక్కడి ప్రధాన విశేషం.
ద్వారకా తిరుమలలో గర్భగుడిలోని మూలవిరాట్టుకు పంచామృతాలతో లేదా జలంతో అభిషేకాలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఆ విగ్రహం వెలసిన వల్మీక నేపథ్యమే గర్భగుడిలో స్వామివారి పీఠం వద్ద ఒక్క నీటి బిందువు పడినా, పుట్టలోని చీమలన్నీ ఒక్కసారిగా పైకి వస్తాయి. ఈ అద్భుతం ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంటుంది. స్వామివారికి నిత్యం సమర్పించే తులసి మాలలు, పూలదండలను తొలగించే సమయంలో వాటిపై నేటికీ సజీవమైన చీమలు సంచరిస్తూ కనిపించడం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఒకవేళ పంచామృతాలు, జలంతో అభిషేకం నిర్వహిస్తే ఆ పుట్టలోని జీవులకు విఘాతం కలగడమే కాకుండా చీమలు గర్భాలయం నిండా వ్యాపిస్తాయి. అందుకే ఆగమశాస్త్ర పండితులు మూలవిరాట్టుకు అభిషేకాలను నిలిపివేసి, సంప్రదాయబద్ధంగా అలంకారాలు, అర్చనలు మాత్రమే నిర్వహించే సంప్రదాయాన్ని స్థిరపరిచారు.
సాధారణంగా ఏ వైష్ణవ దివ్యక్షేత్రంలోనైనా సంవత్సరానికి ఒకసారే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆచారం. కానీ, ద్వారకా తిరుమలలో స్వయం మూర్తితో పాటు ప్రతిష్ఠామూర్తి కూడా ఉండటంతో ఇక్కడ ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో స్వయంభూ స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో ప్రతిష్ఠిత ధ్రువమూర్తికి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నిత్య కల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే ఈ క్షేత్రంలో వివాహాలు, ఉపనయనాలు, అన్నప్రాశన వంటి శుభకార్యాలు నిరంతరం జరుగుతుంటాయి.
ద్వారకా తిరుమలకు మరో అపురూపమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. సాధారణంగా శైవ, వైష్ణవ ఆలయాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం అనంతుడనే సర్పరాజం పర్వతరూపం దాల్చి ‘శేషాద్రి’గా వెలసిందని క్షేత్ర పురాణం చెబుతోంది . ఆ సర్పం తోక భాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వెలిస్తే, శిరస్సు భాగంలో పరమశివుడు మల్లేశ్వర స్వామిగా కొలువుదీరారు. ఒకే కొండపై ఒకవైపు వైకుంఠనాథుడిని, మరోవైపు కైలాసపతిని దర్శించుకునే అరుదైన భాగ్యం లభించడంతో భక్తులు దీనిని పరమ పవిత్రమైన హరిహర క్షేత్రంగా ఆరాధిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడి మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ప్రకృతి రమణీయతకు నిలయమైన ఈ క్షేత్రం కృష్ణా, గోదావరి నదీపాయల మధ్య ఒక పూలహారంలా విరాజిల్లుతోంది . విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలోని భీమడోలు రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం, అధునాతన వసతి గదులు, గోశాల, గజశాల, అశ్వశాల వంటి అన్ని సౌకర్యాలను దేవస్థానం అత్యుత్తమ రీతిలో నిర్వహిస్తోంది . ఏలూరు పరిసరాల్లోని ఆధ్యాత్మిక శోభకు ద్వారకా తిరుమల మకుటాయమానంగా నిలుస్తోంది